Monsoon: మొత్తానికి కదిలిన నైరుతి రుతుపవనాలు.. ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Monsoon Arrives Heavy Rains Lash Mumbai and Kerala
  • 19 రోజుల తర్వాత చురుగ్గా నైరుతి రుతుపవనాలు 
  •  మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణకు విస్తరించిన వైనం
  •  ముంబై, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం 
  • ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం
మూడు వారాల పాటు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తిరిగి వేగం పుంజుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరాన్ని వానలు ముంచెత్తగా, కేరళలోనూ జనజీవనం అస్తవ్యస్తమైంది. రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

సోమవారం నాటికి నైరుతి రుతుపవనాలు మధ్య, ఉత్తర అరేబియా సముద్రంతో పాటు గుజరాత్‌, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. కొంకణ్‌, మధ్య మహారాష్ట్ర, తెలంగాణలో మిగిలిన ప్రాంతాలను కూడా కప్పేశాయి. రుతుపవనాలు మహారాష్ట్ర మొత్తం వ్యాపించి, పొరుగు రాష్ట్రాలైన గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లోకి కూడా ప్రవేశించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజుల్లో గుజరాత్‌, మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లోనూ విస్తరించనున్నాయని అంచనా వేస్తున్నారు.

గుజరాత్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, వాయవ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అనుకూల పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొన్నిచోట్ల వర్షాలు కురిశాయని, రానున్న 24 గంటల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ముంబైలో కుండపోత
రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో, ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబై నగరం, శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడి, సబర్బన్‌ రైళ్లు, మెట్రో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ముంబైలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 మంది మరణించారని, 65 మంది గాయపడ్డారని మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో ముంబై, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. సోమవారం కురిసిన భారీ వర్షాలకు ముంబై, థాణే, పాల్ఘర్‌ తదితర ప్రాంతాలకు ‘ఆరెంజ్‌’ అలర్ట్‌, రాయగడ్‌కు ‘రెడ్‌’ అలర్ట్‌ జారీచేశారు.

కేరళ అతలాకుతలం 
కేరళలోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల బస్సులు, రైళ్ల ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. నదులు, జలాశయాల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో కన్నూర్‌, కాసర్‌గడ్‌ సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కన్నూర్‌లోని కక్కడ్‌ ప్రాంతంలో రహదారిపైకి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాసర్‌కోడ్‌ జిల్లాలోని వెల్లరికుండ్‌ ప్రాంతంలో కనీసం 10 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.  
Monsoon
Southwest Monsoon
Mumbai Rains
Kerala Rains
India Meteorological Department
IMD
Mumbai
Kerala
Heavy Rainfall
Weather Forecast

More Telugu News