Telangana High Court: అక్రమ నిర్మాణాలు.. కూల్చివేతలు: హైదరాబాద్ మున్సిపల్ అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Telangana High Court Angered by Illegal Constructions in Hyderabad
  • మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం
  • నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు ఏం చేస్తారని సూటి ప్రశ్న
  • కూల్చివేతల పేరుతో డ్రామాలు ఆపాలంటూ ఘాటు వ్యాఖ్యలు
  • శేరిలింగంపల్లి కేసులో యథాతథ స్థితికి హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల విషయంలో మున్సిపల్ అధికారుల వైఖరిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భవన నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారని, ఆ సమయంలో కళ్లు మూసుకుని వ్యవహరిస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సోమవారం, శేరిలింగంపల్లి, గుట్టల బేగంపేట ప్రాంతానికి చెందిన ఒక భవన నిర్మాణదారుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

"కోర్టు ఏదైనా ఆదేశాలు జారీ చేసిన తర్వాత మీరు స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు. ఈలోగా అక్కడ భవన నిర్మాణం మొత్తం పూర్తయిపోతుంది. ఆ తర్వాత కూల్చివేత పేరుతో డ్రామా మొదలుపెడతారు" అంటూ అధికారుల తీరుపై మండిపడింది.

ప్రాంతాల వారీగా పర్యవేక్షణకు అధికారులు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు ఎలా సాధ్యమవుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. "పన్నులు వసూలు చేసేటప్పుడు మాత్రం ఆ భవనం వివరాలన్నీ మీకు కచ్చితంగా తెలుస్తాయి. కానీ, అక్రమంగా నిర్మిస్తున్నప్పుడు మాత్రం మీ దృష్టికి రాదా?" అని నిలదీసింది. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి వల్లనే అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని అభిప్రాయపడింది.

ప్రస్తుత పిటిషన్‌కు సంబంధించి, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (బీఆర్ఎస్)పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు (జులై) వాయిదా వేసింది.
Telangana High Court
Hyderabad
illegal constructions
municipal authorities
court orders

More Telugu News