Liam McCarthy: పీడకలలా అరంగేట్రం.. 4 ఓవర్లలో 81 పరుగులు.. ఐర్లాండ్ బౌల‌ర్ చెత్త రికార్డు!

Liam McCarthys Nightmare Debut 81 Runs in 4 Overs
  • నిన్న బ్రెడీ వేదిక‌గా వెస్టిండీస్‌, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ 
  • ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ లియామ్ మెక్కార్తీ అరంగేట్రం
  • అతను వేసిన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 81 పరుగులిచ్చిన వైనం
  • టీ20ల‌లో అత్య‌ధిక ర‌న్స్‌ స‌మ‌ర్పించుకున్న రెండో బౌల‌ర్‌గా అవాంఛిత రికార్డు
ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ లియామ్ మెక్కార్తీ నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ‌ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అయితే, ఈ అరంగేట్ర మ్యాచ్ అత‌నికి పీడ‌క‌ల‌ను మిగిల్చింది. ఐర్లాండ్‌లోని బ్రెడీలో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను వేసిన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 81 పరుగులు ఇచ్చాడు. 

దీంతో టీ20ల‌లో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న రెండో బౌల‌ర్‌గా లియామ్ అవాంఛిత రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఈ జాబితాలో గాంబియాకు చెందిన మూసా జోబ‌ర్తే 93 ర‌న్స్‌తో టాప్‌లో ఉన్నాడు. జింబాబ్వేపై అత‌డు ఈ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్నాడు. అత‌ని త‌ర్వాత ఇప్పుడు లియామ్ రెండో స్థానాన్ని అక్ర‌మించాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్‌కి దిగిన క‌రేబియ‌న్ జ‌ట్టు అరంగేట్ర బౌల‌ర్ అయిన‌ లియామ్ మెక్కార్తీ బౌలింగ్‌లో భారీగా ప‌రుగులు రాబ‌ట్టుకుంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఐదవ ఓవర్‌లో అత‌డు బౌలింగ్‌కు దిగాడు. తొలి ఓవర్‌లోనే ఏకంగా 21 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు. 

ఆ త‌ర్వాత త‌న రెండవ ఓవర్ వేసిన లియామ్‌.. అందులో 24 పరుగులు ఇచ్చాడు. విండీస్ బ్యాట‌ర్‌ లూయిస్ మొదటి నాలుగు బంతుల్లో 6, 4, 4, 4 పరుగులు సాధించాడు. అనంత‌రం హోప్ చివరి బంతికి మరో సిక్స‌ర్ బాదడంతో మొత్తం 24 ర‌న్స్ వ‌చ్చాయి. ఇక‌, మూడో ఓవ‌ర్‌లో 18 ర‌న్స్ ఇచ్చిన లియామ్‌... నాలుగో ఓవ‌ర్‌లోనూ సేమ్ సీన్ రీపిట్ అయింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో కూడా 18 ప‌రుగులు స‌మ‌ర్పించుకుని, మొత్తంగా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 81 ర‌న్స్ ఇచ్చాడు. 

దీంతో విండీస్ జట్టు తొలుత నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 256 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. 257 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 194 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో క‌రేబియ‌న్ జ‌ట్టు 62 ప‌రుగుల తేడాతో బంప‌ర్ విక్ట‌రీ న‌మోదు చేసింది. 
Liam McCarthy
Ireland cricket
West Indies cricket
T20 debut
worst bowling record
T20I cricket
Paul Stirling
cricket record
Musa Jobarteh
Ireland vs West Indies

More Telugu News