Qatar Telugu Pastors: ఖతర్‌లో ఐదుగురు తెలుగు పాస్టర్లు సహా 11 మంది అరెస్ట్

Telugu Pastors Arrested in Qatar for Unauthorized Preaching
  • అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు
  • సందర్శక వీసాలపై వచ్చి ప్రచారంలో పాల్గొన్నట్టు గుర్తింపు
  • రెండు వారాల నిర్బంధం తర్వాత విడుదలైనా ప్రయాణ ఆంక్షలు
  • అనధికార ప్రార్థన స్థలాలపై ఖతర్ పోలీసుల నిఘా
ఖతర్‌లో స్థానిక చట్టాలను ఉల్లంఘించి, అధికారిక అనుమతులు లేకుండా మత ప్రచారం నిర్వహించారనే ఆరోపణలపై పలువురు క్రైస్తవ మత ప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వీరిలో ఐదుగురు తెలుగు పాస్టర్లు కూడా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు వారాలకు పైగా నిర్బంధంలో ఉంచి విచారించిన అనంతరం వీరిని ఇటీవల విడుదల చేసినప్పటికీ, దేశం విడిచి వెళ్లేందుకు ఇంకా అనుమతులు మంజూరు చేయలేదని సమాచారం.

దోహాలోని తుమమా అనే ప్రాంతంలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పాస్టర్లు ఉన్నట్లు తేలింది. అరెస్టయిన వారిలో ముగ్గురు పాస్టర్లు సందర్శక వీసాలపై ఖతర్‌కు వచ్చి, ఇక్కడ మత ప్రచార కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. రెండు వారాలకు పైగా వీరిని అదుపులో ఉంచుకుని విచారించిన అధికారులు ఆ తర్వాత విడుదల చేశారు. అయితే, వారిపై ప్రయాణ ఆంక్షలు కొనసాగుతున్నాయని, దేశం విడిచి వెళ్లేందుకు ఇంకా అనుమతి లభించలేదని తెలిసింది.

ఖతర్‌లో క్రైస్తవులు ప్రార్థనలు చేసుకునేందుకు బర్వా ప్రాంతంలో ఒక విశాలమైన, ప్రత్యేక కాంపౌండ్ కేటాయించారు. అక్కడ ఉన్న చర్చిలకు చట్టబద్ధమైన గుర్తింపు ఉంది. ఈ చర్చిలలో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి వచ్చే వారికి ఖతర్ ప్రభుత్వం ప్రత్యేకంగా సందర్శక వీసాలను కూడా జారీ చేస్తుంటుంది.

అయితే, కొందరు భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు ఈ అధికారిక ఏర్పాట్లను కాదని స్థానిక చట్టాలకు విరుద్ధంగా ప్రైవేటు నివాస స్థలాల్లో, విల్లాల్లో అనుమతి లేకుండా ప్రార్థన కూటములు, చర్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. చట్టబద్ధంగా అనుమతి పొందిన తెలుగు చర్చిల కంటే, ఇలా అనధికారికంగా ఏర్పాటు చేసిన ప్రార్థన స్థలాలకు ప్రజల తాకిడి ఎక్కువగా ఉండటంతో అధికారులు వీటిపై దృష్టి సారించారు.

ఖతర్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో చట్టబద్ధంగా తమ మత విశ్వాసాలను ఆచరించుకోవడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. కానీ, అనుమతి లేకుండా అన్యమత ప్రచారం చేయడం లేదా అనధికారికంగా ప్రార్థనా స్థలాలను నిర్వహించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. గతంలో సిక్కు మతస్థులు కూడా ఒక ప్రదేశంలో అనధికారికంగా గురుద్వారా నిర్వహిస్తున్నప్పుడు, దాని నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసి, ఆ నిర్మాణాన్ని మూసివేయించారు.
Qatar Telugu Pastors
Qatar
Telugu Pastors
Religious Preaching
Arrest
Christian Missionaries
Doha
India
Gulf Countries
Religious Freedom

More Telugu News