Shardul Thakur: అద్భుత శతకంతో అదరగొట్టిన‌ శార్దూల్ ఠాకూర్

Shardul Thakur Smashes Century in Intra Squad Match
  • ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్
  • శార్దూల్ ఠాకూర్ మెరుపు సెంచరీ
  • 68 బంతుల్లో అజేయంగా 122 ర‌న్స్ బాదిన ఆల్ రౌండ‌ర్‌
  • బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ 4 వికెట్లు తీసిన శార్దూల్
  • సర్ఫరాజ్ ఖాన్ కూడా ఫాస్టెస్ట్ సెంచ‌రీ నమోదు
  • టెస్ట్ జట్టులోకి వచ్చేందుకు శార్దూల్ గట్టి పోటీ
ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ఫామ్‌ను క‌న‌బ‌రిచాడు. బెకెన్‌హామ్‌లో నిన్న జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో శార్దూల్ అజేయ శతకంతో చెలరేగాడు. కేవలం 68 బంతుల్లోనే 122 పరుగులు బాదాడు. త‌ద్వారా తానెంతటి కీలక ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. 2023 తర్వాత టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉన్న శార్దూల్.. ఈ ప్రదర్శనతో తిరిగి జట్టులో స్థానం కోసం గట్టి పోటీనిస్తున్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత ప్రధాన జట్టు, ఇండియా-ఏ టీమ్ త‌ల‌ప‌డ్డాయి. ఇండియా-ఏ తరఫున బరిలోకి దిగిన శార్దూల్.. మూడో రోజు ఆటను 19 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ప్రారంభించాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడి, వేగంగా పరుగులు సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ వంటి స్టార్ పేసర్లున్న నాణ్యమైన బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని పవర్ హిట్టింగ్, నాణ్య‌మైన క్రికెట్‌ షాట్లతో సెంచరీ పూర్తి చేశాడు. 

ఇక‌, ఇదే మ్యాచ్‌లో రెండో రోజు సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం 76 బంతుల్లో 101 పరుగులు చేసి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. నాలుగు రోజుల పాటు జరగాల్సిన ఈ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ను జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు మూడో రోజే ముగించారు. జూన్ 20న లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి లభించనుంది. కొత్త సార‌థి శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఈ సిరీస్‌లో తలపడనుంది. 

శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో సెంచరీతో పాటు నాలుగు వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన, తుది జట్టులో అతని స్థానానికి మరింత బలాన్ని చేకూర్చింది. బ్యాట్, బంతితో రాణించగల సామర్థ్యం ఉన్న శార్దూల్, కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు సెలెక్టర్ల దృష్టిని బలంగా ఆకర్షించాడు. కీలక సిరీస్‌కు వ్యూహరచన చేస్తున్న సెలెక్టర్లకు శార్దూల్ ప్రదర్శన మరిన్ని సానుకూల అంశాలను అందించింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
Shardul Thakur
Shardul Thakur century
India A
Intra squad match
England Test series
Jasprit Bumrah
Mohammed Siraj
Sarfaraz Khan
Shubman Gill

More Telugu News