Eric Trappier: భారత రాఫెల్‌లను కూల్చామన్న పాక్ వాదనలు అబద్ధం: డసో ఏవియేషన్

Eric Trappier Denies Pakistan Claim of Downing Indian Rafales
  • ‘ఆపరేషన్ సిందూర్’లో రాఫెల్స్ కూలిపోలేదన్న డసో ఏవియేషన్
  • భారత్ నుంచి నష్టాలపై అధికారిక సమాచారం లేదన్న సీఈవో ఎరిక్ ట్రాపియర్
  • యుద్ధంలో లక్ష్య సాధనే ముఖ్యం.. నష్టాలు కాదని వ్యాఖ్య
భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో కూల్చివేశామంటూ పాకిస్థాన్ చేస్తున్న వాదనల్లో ఎంతమాత్రం నిజం లేదని రాఫెల్ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై ఫ్రెంచ్ విమానయాన దిగ్గజం నుంచి వచ్చిన మొదటి అధికారిక స్పందన ఇదే కావడం గమనార్హం.

పారిస్ ఎయిర్ షోకు ముందు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ 'చాలెంజెస్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎరిక్ ట్రాపియర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెల ప్రథమార్ధంలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా తమ రాఫెల్ యుద్ధ విమానాలకు నష్టం వాటిల్లినట్టు భారత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆయన తెలిపారు. అయితే, మూడు రాఫెల్‌లను ధ్వంసం చేశామన్న పాకిస్థాన్ ప్రకటన మాత్రం ‘ఖచ్చితంగా తప్పుడు సమాచారం’ అని ఆయన కుండబద్దలు కొట్టారు. "ఈ విషయంలో భారతీయులు ఎలాంటి ప్రకటన చేయలేదు, కాబట్టి సరిగ్గా ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ పాకిస్థాన్ చెబుతున్నట్టు మూడు రాఫెల్‌లు ధ్వంసమయ్యాయన్న మాటలు అవాస్తవమని మాకు ఇప్పటికే తెలుసు" అని ట్రాపియర్ పేర్కొన్నారు.

ఆధునిక యుద్ధ తంత్రాలను అంచనా వేసేటప్పుడు కేవలం నష్టాల ఆధారంగా కాకుండా నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంతవరకు చేరుకున్నారనే దానిపై దృష్టి సారించాలని ట్రాపియర్ హితవు పలికారు. "రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రరాజ్యాల దళాలు సైనికులను కోల్పోయినంత మాత్రాన వారు యుద్ధంలో ఓడిపోయారని ఎవరూ చెప్పలేదు కదా" అంటూ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేశారు. పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తే "కొందరికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసే అవకాశం ఉందని" అంతవరకు తొందరపడి ఎలాంటి నిర్ధారణలకు రాకూడదని ఆయన సూచించారు.

రాఫెల్ సామర్థ్యంపై సీఈవో ప్రశంసలు 
4.5వ తరానికి చెందిన ఓమ్నిరోల్ యుద్ధ విమానమైన రాఫెల్ భారత వ్యూహాత్మక వైమానిక దాడుల సామర్థ్యంలో అత్యంత కీలకమైనదని, దీని రాకతో ఈ ప్రాంతంలో వైమానిక శక్తి సమతుల్యత భారత్‌కు అనుకూలంగా మారిందని నిపుణులు భావిస్తున్నారు. రాఫెల్ విమానం విశిష్టతను ట్రాపియర్ మరోసారి నొక్కిచెబుతూ ఇది ప్రపంచంలోనే అత్యంత బహుముఖ ప్రజ్ఞ, సమర్థత కలిగిన మల్టీరోల్ యుద్ధ విమానాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. అమెరికాకు చెందిన ఎఫ్-35 లేదా చైనా తయారుచేస్తున్న ఇతర ప్రత్యామ్నాయ విమానాలతో పోలిస్తే, విభిన్న రకాల సైనిక కార్యకలాపాలకు రాఫెల్ అత్యంత అనుకూలమైనదని ఆయన తెలిపారు. గగనతల పోరాటం, భూతలంపై దాడులు, నిఘా, అణ్వాయుధ ప్రయోగ సామర్థ్యం, యుద్ధనౌకల నుంచి కూడా కార్యకలాపాలు నిర్వహించగలగడం దీని ప్రత్యేక బలాలని ఆయన వివరించారు.

దక్షిణాసియాలో యుద్ధరంగ ప్రదర్శనలు, ఆయుధాల కొనుగోళ్లు, వైమానిక ఆధిపత్యం వంటి అంశాలపై తీవ్ర చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎరిక్ ట్రాపియర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాకిస్థాన్ చేస్తున్న ప్రచారానికి ఇప్పటివరకు ఇదే అత్యంత బలమైన, అధికారిక ఖండనగా నిపుణులు పరిగణిస్తున్నారు.
Eric Trappier
Rafale
Dassault Aviation
Pakistan
Operation Sindoor
Indian Air Force
IAF
Air Warfare
Defence
Fighter Jets

More Telugu News