Uttam Kumar Reddy: గోదావరి-బనకచర్ల వివాదం: వైసీపీ అధినేత జగన్‌ను లాగిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy Slams Harish Rao Over Godavari Banakacherla Project
  • గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై హరీశ్ ఆరోపణలను ఖండించిన మంత్రి ఉత్తమ్
  • ప్రాజెక్టుపై కేంద్రానికి జనవరి 22నే లేఖ రాశామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • తెలంగాణ నీటి హక్కులకు బీఆర్ఎస్సే నష్టం చేసిందని ఆరోపణ
  • కృష్ణా జలాల్లో వాటా 299 టీఎంసీలకు పరిమితం చేసింది బీఆర్ఎస్సేనని విమర్శ
  • జగన్, కేసీఆర్ అవగాహనతోనే ఏపీకి తెలంగాణ నీళ్లు అందాయని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు చేసిన విమర్శలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఖండించారు. హరీశ్‌ రావు వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన కొట్టిపారేశారు.

ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. "గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై మా అభ్యంతరాలను వివరిస్తూ ఈ ఏడాది జనవరి 22వ తేదీనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి స్వయంగా లేఖ రాశాను. ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ మౌనం వహించలేదు, చట్టపరంగానే మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం" అని ఆయన వివరించారు.

తెలంగాణ నదీ జలాల హక్కులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే తీవ్ర నష్టం కలిగించిందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. "కృష్ణా నదిలో తెలంగాణ వాటాను కేవలం 299 టీఎంసీలకే పరిమితం చేసి రాష్ట్రానికి అన్యాయం చేసింది బీఆర్ఎస్ కాదా? వారి హయాంలోనే ముచ్చుమర్రి, మాల్యాల నుంచి ఏపీకి నీటిని తరలించారు. అప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అపెక్స్‌ కౌన్సిల్‌ను ఎందుకు సంప్రదించలేదు?" అని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రోజూ మూడు టీఎంసీల నీటిని తరలిస్తుంటే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేవలం ప్రేక్షకపాత్ర పోషించారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. "జగన్‌, కేసీఆర్‌ మధ్య ఉన్న అవగాహనతోనే తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీకి దోచిపెట్టారు" అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.
Uttam Kumar Reddy
Godavari Banakacherla project
Telangana
Andhra Pradesh
Harish Rao

More Telugu News