Rammohan Naidu: నా తండ్రి ఇలాగే మరణించారు.. వారి బాధను అర్థం చేసుకోగలను: రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu Understands Air India Crash Pain Due to Fathers Death
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రామ్మోహన్ నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష
  • దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • హోంశాఖ సెక్రటరీ నేతృత్వంలో మరో ప్రత్యేక బృందం
  • లభ్యమైన బ్లాక్ బాక్స్, విశ్లేషణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్న మంత్రి
"నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ప్రభావ కుటుంబాల బాధ నాకు తెలుసు.. నేను అర్థం చేసుకోగలను" అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై శనివారం ఆయన ఢిల్లీలో ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామని, గుజరాత్ ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. "ఘటన జరిగిన వెంటనే మంటలను అదుపులోకి తెచ్చి, మృతదేహాలను తరలించాం. ఈ దుర్ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. అవసరమైతే ఈ కమిటీలో మరికొంత మంది సభ్యులను కూడా చేర్చుతాం" అని వివరించారు.

శుక్రవారం సాయంత్రం ఘటనా స్థలంలో విమాన బ్లాక్‌బాక్స్‌ లభ్యమైందని, దానిని విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. "బ్లాక్ బాక్స్‌లో ఏముందో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాం" అని పేర్కొన్నారు.

దర్యాప్తు ప్రక్రియ గురించి వివరిస్తూ, "హోంశాఖ సెక్రెటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఇందులో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రత్యేక అధికారులు సభ్యులుగా ఉంటారు. సంపూర్ణ దర్యాప్తు జరిపేందుకు ఈ కమిటీ దోహదపడుతుంది. నిపుణుల విచారణ పూర్తయిన తర్వాత, తగిన సమయంలో మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తాం. రెండు నెలల్లోగా విచారణ పూర్తవుతుందని ఆశిస్తున్నాం. అంతేకాకుండా, బోయింగ్‌ 787 సిరీస్‌ విమానాలను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం" అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.
Rammohan Naidu
Air India
Ahmedabad
Plane Accident
Civil Aviation
Black Box
Investigation

More Telugu News