Ahmedabad Airport Accident: కళ్లముందే ప్రమాదం.. కన్నీటితో టేకాఫ్

 Ahmedabad Airport Accident Pilots Emotional Takeoff
  • అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత టేకాఫ్ తీసుకున్న పైలట్లపై తీవ్ర మానసిక ప్రభావం
  • భయం, షాక్ ఉన్నప్పటికీ శిక్షణ, వృత్తి నైపుణ్యంతో విధులు
  • నాలుగు గంటల విరామం కొంత ఊరటనిచ్చిందన్న నిపుణులు
కళ్ల ముందే ఘోర ప్రమాదం.. అక్కడ పరిస్థితి పూర్తిగా చక్కబడనే లేదు. ఆ తర్వాత అదే ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకోవాల్సిన, ల్యాండింగ్ చేయాల్సిన పైలట్ల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఓవైపు తోటి పైలట్ కాలిబూడిదయ్యారనే విషాదం, మరోవైపు ఈ టేకాఫ్ సాఫీగా జరుగుతుందో లేదోననే ఆందోళనతో కొట్టుమిట్టాడుతారని వివరించారు. గురువారం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు నాలుగు గంటల పాటు బ్రేక్ ఇచ్చారు. దీంతో పైలట్ల ఆందోళన కొంత తగ్గేందుకు దోహదం చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఎంత కఠినమైన శిక్షణ పొందినప్పటికీ, ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత దాని ప్రభావం ఎంతోకొంత పైలట్లపై పడుతుందన్నారు. ఈ ఘటనలు వారిలో భయాన్ని రేకెత్తిస్తాయని, అయితే తమ శిక్షణ, వృత్తి నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే దృక్పథంతో వారు విధులను కొనసాగిస్తారని చెబుతున్నారు.

నాగార్జున ద్వారకానాథ్ అనే కమర్షియల్ పైలట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. "ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రభావితం కాకుండా ఉండటం అసాధ్యం. 'తదుపరి నేను కాకూడదు' అనే ఆలోచన మనసులో మెదులుతుంది" అని అన్నారు. 2006లో గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలో జరిగిన ఓ ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ, ఓ మాజీ నేవీ పైలట్, "ప్రమాదం గురించి రేడియోలో విన్న వెంటనే నేను ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. కళ్లలో నీళ్లు, గుండె దడతోనే విమానం ల్యాండ్ చేశాను. ఆ ప్రమాదంలో మరణించిన పైలట్ నాకు పదేళ్లుగా తెలుసు. శిక్షణ, అలవాటైన పనులే నన్ను సురక్షితంగా ల్యాండ్ చేశాయి, కానీ మనసు మాత్రం తీవ్రంగా చెదిరిపోయింది" అని తెలిపారు.

అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రమాదం తర్వాత టేకాఫ్ తీసుకున్న పైలట్లకు ఇది "చాలా సవాలుతో కూడుకున్నది" అని మరో పైలట్ అభిప్రాయపడ్డారు. ప్రమాదం తర్వాత విమానాశ్రయ కార్యకలాపాలను నాలుగు గంటలపాటు నిలిపివేయడం కొంతవరకు పైలట్లు కోలుకోవడానికి సహాయపడిందని కొందరు నిపుణులు తెలిపారు. "ఇలాంటి మరణాలను దగ్గర నుంచి చూడటానికి ఏ శిక్షణా సిద్ధం చేయలేదు. అయినప్పటికీ, పైలట్లు తమను తాము కూడదీసుకుని, తిరిగి విధుల్లోకి వస్తారు" అని ఒక గ్లోబల్ క్యారియర్‌కు చెందిన పైలట్ అన్నారు. ప్రమాదం తర్వాత టేకాఫ్ తీసుకున్న పైలట్లు తమ విమానానికి సంబంధించిన ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటారని, కుటుంబ సభ్యులతో మాట్లాడి తాము సురక్షితంగా ఉన్నామని చెప్పి ఉంటారని మాజీ నేవీ పైలట్ తెలిపారు. "అయితే, వారి ముఖాల్లో చిరునవ్వు మాత్రం కచ్చితంగా మాయమై ఉంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
Ahmedabad Airport Accident
Ahmedabad
Pilot mental health
Flight safety
Aircraft accident
Sardar Vallabhbhai Patel International Airport
Nagarguna Dwarkanath
Airline pilot
aviation accident
Goa Dabolim Airport

More Telugu News