Pedda Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు .. తాడిపత్రిలో ఉద్రిక్తత

Pedda Reddy Stopped by Police in Tadipatri Tensions Rise
  • ఈ రోజు ఉదయం తాడిపత్రికి బయలుదేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • పెద్దారెడ్డి రాక సమాచారంతో జేసీ ప్రభాకరరెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు
  • శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు 
  • పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన గొడవల నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని జేసీ ప్రభాకరరెడ్డి వర్గీయులు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ఆయనను తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మూడుసార్లు ఇంతకు ముందు అడ్డుకున్నారు.

పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఇటీవల హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సుమారు 300 మంది జేసీ ప్రభాకరరెడ్డి నివాసం వద్దకు చేరుకోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలియగానే పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. టీడీపీ నేతలతో పోలీసులు చర్చలు జరిపారు. చివరకు పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టీడీపీ శ్రేణులను జేసీ ఇంటి వద్ద నుంచి పంపించారు.

అయితే ఈ రోజు ఉదయం నిజంగానే పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరడం హాట్ టాపిక్ అయింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఇరువర్గాల ఘర్షణల వల్ల పట్టణంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 
Pedda Reddy
Tadipatri
Anantapur
JC Prabhakar Reddy
YCP
TDP
Andhra Pradesh Politics
High Court
Police
Political Conflict

More Telugu News