Karimnagar Police: దొంగబాబాను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు

Karimnagar Police Arrested Fake Baba Gang Involved in Gold Scam
  • గుప్త నిధుల పేరుతో దొంగ బాబా మోసం
  • దొంగ బాబాను ఆశ్రయించి మోసపోయిన కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లెకు చెందిన గజ్జి ప్రవీణ్
  • నిందితులను అరెస్టు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దొంగ బాబాలు మోసాలకు పాల్పడుతూ దోచుకుంటున్నారు. గుప్త నిధుల పేరుతో అనేక ప్రాంతాల్లో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న దొంగ బాబాల ముఠా సభ్యులను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు.

కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ తన కుటుంబంలో ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఉన్నాయని దొంగ బాబాను ఆశ్రయించాడు. దీంతో దొంగ బాబా ముఠా సభ్యులు మీ ఇంటి పక్కనే క్వింటాల్ వరకు బంగారం ఉందని, దానికి పూజలు చేసి బయటకు తీస్తే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుపడుతుందని, లేకపోతే మీ ఇంట్లో వారు చనిపోతారని బాధితుడు గజ్జి ప్రవీణ్ ను బెదిరించారు.

గుప్త నిధి వెలికితీసే పూజల కోసం అంటూ విడతల వారీగా దొంగ బాబా గ్యాంగ్ సభ్యులు బాధితుడి నుంచి రూ.15.30 లక్షలు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు కొంత పూజ సామాగ్రి కొనుగోలు చేసి ఇంటి పక్కనే ఒక గొయ్యి తవ్వి కుంకుమ చల్లి అందులో నుంచి ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒక డబ్బా బయటకు తీసి ఇందులో బంగారం ఉందని బాధితుడు గజ్జి ప్రవీణ్ ను నమ్మబలికి, ఇంకా డబ్బులు కావాలని వేధించారు.

దీంతో బాధితుడు కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గుప్త నిధుల పేరుతో మోసం చేసిన ఈన్నాల రాజు, మిర్యాల దుర్గయ్య, పెనుగొండ రాజు, చల్ల అజయ్, ఈర్నాల సతీశ్ లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.15.30 లక్షల నగదుతో పాటు ఏడు తులాల బంగారం, మూడు కార్లు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ తెలిపారు. 
Karimnagar Police
Fake Baba
Fake Baba Gang
Telangana Crime
Gajji Praveen
Gupt Nidhulu
Kothapalli Police
Cheating Case
Gold Scam
Shubham Prakash

More Telugu News