Thalliki Vandanam: ఇచ్చిన మాట ప్ర‌కారం ఖాతాల్లో 'త‌ల్లికి వంద‌నం' డ‌బ్బులు ప‌డుతున్నాయి: టీడీపీ

Thalliki Vandanam Scheme Funds Deposited into Accounts in Andhra Pradesh
  • ఏపీలో నిన్న‌టి నుంచి 'తల్లికి వందనం' పథకం అమ‌లు
  • ఇవాళ ల‌బ్ధిదారుల ఖాతాల్లో ప‌డుతున్న నిధులు.. ఈమేర‌కు టీడీపీ పోస్ట్‌
  • 35,44,459 త‌ల్లులు, సంర‌క్ష‌కుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌కానున్న నిధులు 
  • ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థి తల్లికి ఏటా రూ.15వేలు
  • గతంలోని అమ్మ ఒడిలా కాకుండా, ఈసారి ప్రతి బిడ్డకూ ఆర్థిక సాయం
ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూట‌మి ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది. నిన్న‌టి నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న ప్రతి బిడ్డకూ వారి తల్లులకు ఏటా ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఇందులో భాగంగా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన త‌ల్లికి వంద‌నం నిధులు విద్యార్థుల త‌ల్లులు, సంర‌క్ష‌కుల ఖాతాల్లో జ‌మ అవుతున్నాయి. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో టీడీపీ పోస్ట్ చేసింది. "చెప్పిన విధంగా... ఇచ్చిన మాట ప్ర‌కారం ఖాతాల్లో త‌ల్లికి వంద‌నం డ‌బ్బులు ప‌డుతున్నాయి" అని పార్టీ పేర్కొంది. 

ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న ఓ ల‌బ్ధిదారు ఖాతాలో రూ. 26వేలు ప‌డ్డాయ‌ని పేర్కొంటూ బ్యాంకు నుంచి మెబైల్‌కు వ‌చ్చిన సందేశాన్ని టీడీపీ పోస్ట్ చేసింది. మ‌రో రూ. 4వేలు పాఠ‌శాల ఖాతాలో జ‌మ అయ్యాయ‌ని తెలిపింది. 

కాగా, నిన్న‌టి నుంచి అమ‌లు చేస్తున్న తల్లికి వంద‌నం ప‌థ‌కం కింద రాష్ట్ర‌వ్యాప్తంగా 35,44,459 త‌ల్లులు, సంర‌క్ష‌కుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జ‌మ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇందులో రూ.13వేలు ల‌బ్ధ‌దారుల బ్యాంకు ఖాతాల‌కు, మిగ‌తా రూ.2వేల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధి కోసం క‌లెక్ట‌ర్ల ఖాతాల‌కు జ‌మ చేస్తారు. 

ఇక‌, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అమ్మ ఒడి' పథకానికి ఇది సవరించిన రూపం. అయితే, 'అమ్మ ఒడి'లో కుటుంబానికి ఒకరికి మాత్రమే పరిమితం కాగా, 'తల్లికి వందనం' కింద ప్రతి బిడ్డకూ ప్రయోజనం చేకూరనుంది. అర్హత పొందిన ప్రతి తల్లి ఖాతాలో డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) విధానంలో సంవత్సరానికి రూ. 15,000 జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కోసం మొత్తం రూ. 8,745 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. 


Thalliki Vandanam
Chandrababu
Andhra Pradesh
AP government
Education scheme
Financial assistance
Students mothers
DBT scheme
Amma vodi scheme

More Telugu News