Tiran Alexander: పైలట్‌నని చెప్పుకుంటూ ఆరేళ్లలో 120 సార్లు ఫ్రీగా విమాన ప్రయాణం!

Florida Man Tiran Alexander Scammed Free Flights for 6 Years
  • ఫ్లోరిడాలో పైలట్‌గా, ఫ్లైట్ అటెండెంట్‌గా నటించిన వ్యక్తి అరెస్ట్
  • ఎయిర్‌లైన్స్ ఉద్యోగినంటూ నకిలీ గుర్తింపు కార్డుల వినియోగం
  • స్పిరిట్ ఎయిర్‌లైన్స్ పోర్టల్ ద్వారా ఇతర విమానాల్లోనూ టికెట్లు
  • వైర్ ఫ్రాడ్, ఐడెంటిటీ దొంగతనం కింద కేసు నమోదు
  • 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి విమానయాన సంస్థల సిబ్బందిగా నటిస్తూ ఆరేళ్ల వ్యవధిలో 120కి పైగా విమాన ప్రయాణాలను ఉచితంగా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. టిరాన్ అలెగ్జాండర్ అనే ఈ వ్యక్తి, పైలట్ లేదా ఫ్లైట్ అటెండెంట్‌గా నమ్మించి వివిధ ఎయిర్‌లైన్స్‌ను మోసం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేరాలకు గాను అతడిపై వైర్ ఫ్రాడ్, గుర్తింపు దొంగతనం, విమానయాన సంస్థలను మోసం చేసినట్టు అభియోగాలు మోపారు.

అలెగ్జాండర్ ఏకంగా ఏడు వేర్వేరు విమానయాన సంస్థలలో తాను ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పుకుని ‘నాన్‌రెవ్’ (ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం) పద్ధతిలో ప్రయాణించాడు. ఇందుకోసం ఒక ఎయిర్‌లైన్‌కు చెందిన అంతర్గత టికెట్ పోర్టల్‌ను ఉపయోగించి ఇతర ఎయిర్‌లైన్స్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకున్నాడు. ఈ మోసపూరిత చర్యలకు పాల్పడేందుకు అలెగ్జాండర్ అసలైన విమానయాన సంస్థల ఉద్యోగుల క్రెడెన్షియల్స్‌ను (గుర్తింపు వివరాలను) సంపాదించాడు. వారి బ్యాడ్జ్ నంబర్లను కూడా దొంగిలించి తాను ఆయా సంస్థల ఉద్యోగినని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఉచిత ప్రయాణాల కోసం అతడు 30 వేర్వేరు సెట్ల క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించినట్టు తేలింది. ఈ ప్రయోజనాలను పొందడానికి కొన్నిసార్లు పైలట్‌గా, మరికొన్నిసార్లు ఫ్లైట్ అటెండెంట్‌గా చెప్పుకున్నాడు.

ఈ మోసపూరిత బుకింగ్‌లను అలెగ్జాండర్ ప్రధానంగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల ట్రావెల్ పోర్టల్ ద్వారా చేసినట్టు అధికారులు గుర్తించారు. చాలా విమానయాన సంస్థలకు ఇతర సంస్థలతో పరస్పర ఒప్పందాలు ఉంటాయి. దీనివల్ల ఒక సంస్థ ఉద్యోగులు తమ అంతర్గత ట్రావెల్ బుకింగ్ సైట్ ద్వారా ఇతర ఎయిర్‌లైన్స్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ గురించి తెలిసిన అలెగ్జాండర్ పలు విమానయాన సంస్థల సిబ్బంది వివరాలను సేకరించాడు. వారి ఉద్యోగంలో చేరిన తేదీ, బ్యాడ్జ్ నంబర్, వారు పనిచేస్తున్న సంస్థ పేరు వంటి వివరాలను నమోదు చేసి ఉచిత విమాన ప్రయాణాలను పొందాడు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించిన వివరాల ప్రకారం అలెగ్జాండర్ 2018 నుంచి 2024 వరకు ఈ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఇతర క్యారియర్‌ల ఉద్యోగిగా నటిస్తూ అతను స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌లో 34 ట్రిప్పులు చేశాడు. "అలెగ్జాండర్ ఫ్లైట్ అటెండెంట్‌గా అబద్ధం చెప్పి 120 కంటే ఎక్కువ ఉచిత విమాన ప్రయాణాలు బుక్ చేసుకున్నాడు" అని కోర్టు పత్రాలు పేర్కొన్నాయి. అతడి ఎయిర్‌లైన్ క్యారియర్ వెబ్‌సైట్ అప్లికేషన్ ప్రక్రియలో ఏడు వేర్వేరు విమానయాన సంస్థలకు పనిచేశానని, 30 వేర్వేరు బ్యాడ్జ్ నంబర్లు, ఉద్యోగంలో చేరిన తేదీలు కలిగి ఉన్నట్టు వెల్లడైంది. ఈ ఆరోపణలు రుజువైతే అలెగ్జాండర్‌కు 20 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించే అవకాశం ఉంది.
Tiran Alexander
airline fraud
free flights
nonrev travel
Spirit Airlines
flight attendant
pilot impersonation
employee travel benefits
identity theft
travel portal

More Telugu News