Donald Trump: మస్క్ క్షమాపణను అంగీకరించిన ట్రంప్.. వివాదానికి ముగింపు!

Donald Trump Accepts Elon Musk Apology Ending Feud
  • ట్రంప్, మస్క్ మధ్య మాటల యుద్ధానికి తెర
  • ఎలాన్ మస్క్ క్షమాపణకు ట్రంప్ ఆమోదం
  • ట్రంప్ విధానాలపై మస్క్ తీవ్ర విమర్శలు
  • క్షమాపణ చెప్పడం మంచిదేనన్న ట్రంప్
  • వివాదం ముగిసిందని వైట్ హౌస్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మస్క్ క్షమాపణ చెప్పగా, దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది.

వివాదానికి దారితీసిన మ‌స్క్‌ వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన "బిగ్ బ్యూటిఫుల్ బిల్" అనే వ్యయ కార్యక్రమంపై తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్లును "నిధుల దుర్వినియోగంతో కూడిన కాంగ్రెస్ వ్యయ బిల్లు" అని, "అసహ్యకరమైనది" అని అభివర్ణిస్తూ, దానికి మద్దతు తెలిపిన వారిని కూడా తప్పుపట్టారు.

ఈ ఆన్‌లైన్ విమర్శలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తన అధికార బృందంలో మస్క్‌కు అంత ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించడమే కాకుండా, వివాదం ముదరడంతో మస్క్ కంపెనీలకు ఇచ్చే ఫెడరల్ కాంట్రాక్టులను నిలిపివేస్తామని కూడా హెచ్చరించారు.

దిగివచ్చిన మస్క్.. ట్రంప్ స్పందన
వారం రోజుల పాటు తీవ్ర వాదోపవాదాలు, ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో నిన్న‌ తెల్లవారుజామున మస్క్ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ట్రంప్‌పై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు హద్దు మీరాయని అంగీకరిస్తూ అందుకు విచారం వ్యక్తం చేశారు.

మస్క్ పశ్చాత్తాపంపై ట్రంప్‌ న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ... "ఆయన అలా చేయడం చాలా మంచిదని నేను భావించాను. నాకు ఎలాంటి కఠినమైన భావాలు లేవు అని చెబుతూనే తాను కొంచెం నిరాశ చెందాను" అని ట్రంప్ అన్నారు. దీంతో మస్క్ క్షమాపణను ట్రంప్ గుర్తించారని (acknowledged) వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అధికారికంగా ధ్రువీకరించారు. దాంతో ఈ వివాదం పరిష్కారమైనట్లు భావిస్తున్నామని తెలిపారు.

క్షమాపణతో ప్రస్తుతానికి వైరం చల్లారినప్పటికీ తన ప్రధాన దృష్టి దేశాన్ని చక్కదిద్దడంపైనే ఉందని, వ్యక్తిగత వివాదాలకు పెద్దగా ప్రాముఖ్యత లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వివాదం నుంచి ఇరువురు నేతలు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని, ఈ సయోధ్య వైట్ హౌస్, దేశంలోని ప్రముఖ టెక్ ఆవిష్కర్తలలో ఒకరి మధ్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
Donald Trump
Elon Musk
Trump Musk feud
Big Beautiful Bill
X platform
Federal contracts
White House
US President
Tech innovator
apology

More Telugu News