Delhi Girl Murder: బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక.. సూట్‌కేసులో శవమై తేలింది!

Delhi Girl Murder 9 Year Old Found Dead in Suitcase
  • ఢిల్లీ నెహ్రూ విహార్‌లో 9 ఏళ్ల బాలిక దారుణ హత్య
  • బాలికపై లైంగిక దాడి జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం
  • నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
బంధువుల ఇంటికి వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి సూట్‌కేసులో శవమై కనిపించింది. ఈశాన్య ఢిల్లీలోని నెహ్రూ విహార్ ప్రాంతంలో గత రాత్రి ఈ దారుణం చోటుచేసుకోగా, ఈ ఉదయం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక వైద్య పరిశీలనల ఆధారంగా బాలికపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గత రాత్రి బాధిత బాలిక సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. రెండు గంటలు గడిచినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించడం ప్రారంభించారు. తమ ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక ఇంటి వైపు బాలిక వెళ్లినట్లుగా ఎవరో చెప్పడంతో బాలిక తండ్రి అక్కడికి వెళ్లారు.

ఆ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్‌కు బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని బాలిక తండ్రి గమనించారు. అనుమానంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఒక సూట్‌కేసులో తన కుమార్తె కదలకుండా పడి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో బాలిక ఒంటిపై నూలుపోగు కూడా లేదని తెలిసింది.

ఈ ఘటనపై బాలిక తండ్రి మాట్లాడుతూ "నేను ఆ ఫ్లాట్‌కు చేరుకుని తాళం పగలగొట్టాను. లోపల సూట్‌కేసులో నా కూతురు స్పృహ లేకుండా పడి ఉంది. వెంటనే మా వీధిలోనే ఉన్న నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లాను" అని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు తెలిపారు. "మా అమ్మాయి దగ్గర్లోని మా బంధువులకు ఐస్ ఇవ్వడానికి వెళ్లింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో బంధువులకు ఫోన్ చేస్తే అసలు అక్కడికి రాలేదని చెప్పారు. నేను వెతకడం మొదలుపెట్టాక, మా అమ్మాయి దగ్గర్లోని ఒక ఫ్లాట్‌లోకి వెళ్లిందని, ఎవరో లోపలికి పిలిచారని ఒకరు చెప్పారు. ఆ ఇంటి యజమానిని అడిగితే ఫ్లాట్‌కు తాళం వేసి ఉందని, తాళాలు తన సోదరుడి దగ్గర ఉన్నాయని చెప్పాడు. అమ్మాయి అప్పటికే వెళ్లిపోయిందని కూడా అన్నాడు. కావాలంటే చూసుకోమన్నాడు. మేము వెళ్తుంటే ఆ యజమాని అక్కడి నుంచి పారిపోయాడు" అని ఆయన వివరించారు. "తాళం పగలగొట్టి చూడగా, నా బిడ్డ సూట్‌కేసులో కనిపించింది" అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

బాలిక తండ్రి వెంటనే చిన్నారిని జేపీసీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం, ఆధారాలు సేకరించేందుకు పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు వెల్లడించారు.  
Delhi Girl Murder
Delhi crime
Child death
Nehru Vihar
Sexual assault
Suitcase murder
Delhi police
Crime news
India crime
Child abuse

More Telugu News