Nadendla Manohar: ఏడు రోజుల్లో కోటి మందికి పైగా రేషన్ సరఫరా: మంత్రి నాదెండ్ల మనోహర్

Ration Supplied to Over 1 Crore People in Seven Days says Nadendla Manohar
  • 72 శాతం మంది ల‌బ్ధిదారుల‌కు విజయవంతంగా పంపిణీ చేశామ‌న్న మంత్రి
  • రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో గొప్ప మైలురాయిగా పేర్కొన్న నాదెండ్ల
  • వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవ
  • ఇప్పటివరకు 11,05,439 మందికి ఈ విధంగా పంపిణీ చేసినట్లు వెల్ల‌డి
రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా ఏడు రోజుల్లో కోటి మందికి పైగా రేషన్ సరుకులు అందించడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన పౌర సరఫరా విధానంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభమైంది. ఈ ఏడు రోజుల వ్యవధిలో 1,05,27,767 మంది కార్డుదారులకు రేషన్ అందజేశామ‌ని మంత్రి తెలిపారు. అంటే 72 శాతం మందికి రేషన్ సరుకులు అందజేశామన్నారు. అదేవిధంగా 98,77,670 మంది కార్డుదారులకు పంచదార పంపిణీ చేశామ‌ని, ఇది 67.56 శాతమ‌ని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇప్పటివరకు 11,05,439 మందికి ఈ విధంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రేషన్ తీసుకునే కుటుంబాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుందన్నారు. 

“ఇంటింటికీ సేవ” లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంద‌ని, ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమకు అనుకూల సమయాల్లో రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. రేషన్ షాపుల్లో వినియోగదారుల కోసం మరింత సౌకర్యవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని, గతంలో ఉన్న పాత రేషన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.

సరఫరా వ్యవస్థలో పొరపాట్లకు తావు లేకుండా, సేవా దృక్పథంతో డీలర్లు పనిచేయాలని సూచించారు. పారదర్శకంగా, బాధ్యతతో, ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సంద‌ర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Nadendla Manohar
Ration distribution
Andhra Pradesh
Civil Supplies
Public Distribution System
Fair Price Shops
Ration card holders
Sugar distribution
Door to door service

More Telugu News