Simla Agreement: సిమ్లా ఒప్పందంపై పాకిస్థాన్‌లో గందరగోళం.. సొంత మంత్రి వ్యాఖ్యలకు విదేశాంగ శాఖ కౌంటర్!

Simla Agreement Confusion in Pakistan Ministers Remarks Contradicted
  • భారత్‌తో సిమ్లా ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఒప్పందానికి విలువ లేదన్న మంత్రి.. 'డెడ్ డాక్యుమెంట్'గా అభివర్ణన
  • మంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చిన పాక్ విదేశాంగ శాఖ
  • సిమ్లా సహా ఏ ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదని స్పష్టీకరణ
  • 1972 నాటి ఒప్పందం ప్రకారమే భారత్‌తో సంబంధాలు కొనసాగుతాయని వెల్లడి
భారత్‌తో 1972లో కుదిరిన చారిత్రక సిమ్లా ఒప్పందంపై పాకిస్థాన్‌లో భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ ఒప్పందం కాలం చెల్లిన 'డెడ్ డాక్యుమెంట్' అని సంచలన వ్యాఖ్యలు చేయగా, పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాత్రం దీనిని తోసిపుచ్చింది. భారత్‌తో సిమ్లా ఒప్పందంతో సహా ఏ ద్వైపాక్షిక ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకునే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.

ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, "సిమ్లా ఒప్పందానికి ఇక విలువ లేదు. అది ఒక డెడ్ డాక్యుమెంట్. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారో లేదో తెలియదు గానీ.. సిమ్లా అగ్రిమెంట్ పని అయిపోయింది" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తాము 1948 నాటి స్థితికి చేరుకున్నామని, ప్రస్తుతం ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) కేవలం కాల్పుల విరమణ రేఖగా పరిగణించాల్సి వస్తుందని ఆయన పరోక్షంగా సూచించారు. 1948 భారత్-పాక్ యుద్ధం అనంతరం ఈ కాల్పుల విరమణ రేఖను ఏర్పాటు చేశారు.

అయితే, రక్షణ మంత్రి వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి భిన్నంగా స్పందించారు. "భారత్‌తో ఏ ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆ దేశంతో ఉన్న సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అమల్లో ఉంటాయి" అని ఆ ప్రతినిధి ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’కు వెల్లడించారు.

1971 భారత్-పాక్ యుద్ధం అనంతరం 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. దీనిపై అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, ఇరు దేశాల మధ్య శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, కశ్మీర్‌తో సహా పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను మూడో దేశం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. జమ్ముకశ్మీర్‌లో అప్పటి కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖగా పునర్నిర్వచించడం, దానిని ఏకపక్షంగా మార్చకూడదన్న నిబంధనకు ఇరు దేశాలు కట్టుబడి ఉండటం, బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని పాకిస్థాన్ గుర్తించి ఆ దేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తేవడం వంటివి ఈ ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు.

ఏప్రిల్‌లో పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అనంతరం మే 7వ తేదీన పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించింది. ఆ తర్వాత మే 8, 9, 10 తేదీలలో పాక్ సైన్యం భారత మిలిటరీ బేస్‌లపై దాడికి యత్నించగా, భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.
Simla Agreement
Khawaja Asif
Pakistan
India
Indira Gandhi
Zulfikar Ali Bhutto
LOC

More Telugu News