Kiren Rijiju: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: తేదీలు ఖరారు చేసిన కేంద్రం

Kiren Rijiju Announces Parliament Monsoon Session Dates
  • పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు
  • జులై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు
  • పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు విపక్షాల డిమాండ్
  • ప్రత్యేక భేటీకి ప్రధానికి విపక్ష ఎంపీల లేఖ
  • కీలక బిల్లులు, జాతీయ భద్రత అంశాలపై చర్చకు అవకాశం
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మొత్తం 23 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వ్యవహారాలపై పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చించాలని విపక్షాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.

విపక్షాల డిమాండ్లు, ప్రధానికి లేఖ

పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తున్నారని, దీనిపై ప్రజల్లో అనేక ప్రశ్నలున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 200 మందికి పైగా లోక్ సభ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించడం, ట్రంప్ మధ్యవర్తిత్వంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. ఈ సమావేశాల్లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
Kiren Rijiju
Parliament
Monsoon Session
Operation Sindoor
Pahalgam Terrorist Attack

More Telugu News