KR Suryanarayana: విజయవాడలో ఏపీజీఈఏ సమావేశాలు... ఉద్యోగులకు సెలవు మంజూరు చేసిన కూటమి సర్కారు

KR Suryanarayana APGEA Meeting Special Leave Granted to Employees
  • ఈ నెల 5, 6 తేదీల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశాలు 
  • విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సమావేశాలు
  • ఈ నెల 5వ తేదీ ఉద్యోగులకు సెలవు మంజూరు చేస్తూ నేడు జీవో విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఆధ్వర్యంలో జరగనున్న సమావేశాలకు హాజరయ్యే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్) మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం (జూన్ 2) ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయవాడలో జూన్ 5, 6 తేదీల్లో ఏపీజీఈఏ సమావేశాలు నిర్వహించ తలపెట్టింది.

ఈ సమావేశాల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా రెండు రోజుల పాటు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఉద్యోగుల విజ్ఞప్తిని పాక్షికంగా అంగీకరించిన ప్రభుత్వం, జూన్ 5వ తేదీన జరిగే ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో జరిగే ఈ రాష్ట్రస్థాయి సమావేశాలకు రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు హాజరుకానున్నట్లు సమాచారం.

అయితే, ఈ ప్రత్యేక సెలవును పొందాలనుకునే ఉద్యోగులు తప్పనిసరిగా సాధారణ సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
KR Suryanarayana
APGEA
Andhra Pradesh Government Employees Association
Vijayawada
Employee Union Meeting
Special Casual Leave
Government Employees
AP Employees News
Indira Gandhi Municipal Stadium
AP Government

More Telugu News