Delhi Covid: ఢిల్లీలో కరోనా కలకలం: 22 ఏళ్ల యువతి మృతి!

Delhi Covid Scare 22 Year Old Woman Dies
  • క్షయ, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న యువతికి కొవిడ్
  • పది రోజుల్లో దేశ రాజధానిలో ఇది మూడో కరోనా మరణం
  • దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కేరళలో అత్యధికం
  • మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధిక యాక్టివ్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇదివరకే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 22 ఏళ్ల యువతి కొవిడ్ బారిన పడి మరణించడం ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజుల్లో ఇది మూడవ కరోనా సంబంధిత మరణం కావడం గమనార్హం. ఈ ఘటనతో నగరంలో కొవిడ్ కేసుల పెరుగుదలపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఢిల్లీలో 22 ఏళ్ల యువతి మరణానికి కరోనా కారణమని తేలింది. ఆమెకు అంతకుముందే పల్మనరీ ట్యూబర్‌క్యులోసిస్ (క్షయ), ఊపిరితిత్తుల కింది భాగంలో ద్వైపాక్షిక శ్వాసకోశ ఇన్ఫెక్షన్ (బైలాటరల్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ అనారోగ్య సమస్యలతో పాటు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది.

గత పది రోజుల్లో ఢిల్లీలో కొవిడ్ కారణంగా సంభవించిన మూడవ మరణం ఇది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఇది నాలుగవ కరోనా మరణం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,961 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి. ఇందులో కేరళ (1,435 కేసులు) ప్రథమ స్థానంలో ఉండగా, మహారాష్ట్ర (506 కేసులు) రెండో స్థానంలో, ఢిల్లీ 483 యాక్టివ్ కేసులతో మూడో స్థానంలో ఉన్నాయి.
Delhi Covid
Covid Delhi
Delhi Coronavirus
Coronavirus Delhi
Covid Deaths Delhi

More Telugu News