Revanth Reddy: తెలంగాణ అవతరణ వేడుక: గవర్నర్ తేనీటి విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సుందరీమణులు

Revanth Reddy Attends Governors Telangana Formation Day Tea Party
  • తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో తేనీటి విందు
  • గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు
  • పాల్గొన్న నిర్మాత దిల్‌రాజు దంపతులు
  • ప్రత్యేక ఆకర్షణగా మిస్‌వరల్డ్‌ సుచాత, రన్నరప్‌లు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తాజా ప్రపంచ సుందరి ఓపల్ సుచాత నేతృత్వంలోని సుందరీమణుల బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గవర్నర్ ఇచ్చిన ఈ తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), డీజీపీ సహా పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారుల కలయికతో రాజ్‌భవన్ ప్రాంగణం సందడిగా మారింది.

ఈ వేడుకలో సినీ నిర్మాత దిల్ రాజు దంపతులతో పాటు అంతర్జాతీయ అందాల పోటీల్లో విజేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవల మిస్‌వరల్డ్‌గా కిరీటం గెలుచుకున్న థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్‌ సుచాత, మొదటి రన్నరప్‌ ఇథియోపియాకు చెందిన హాసెట్‌ డెరెజే, రెండో రన్నరప్‌ పోలాండ్‌కు చెందిన మయా క్లైడా, మూడో రన్నరప్‌ మార్టినిక్‌కు చెందిన ఆరేలి జోచిమ్‌ ఈ విందులో పాల్గొన్నారు. వీరంతా రాజ్‌భవన్‌ను సందర్శించి, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కలిశారు.
Revanth Reddy
Telangana Formation Day
Governor Jishnu Dev Varma
Miss World

More Telugu News