Mediterranean Diet: ఐబీఎస్ లక్షణాల ఉపశమనానికి మెడిటరేనియన్ డైట్‌: తాజా అధ్యయనం వెల్లడి

People with irritable bowel syndrome can find relief with Mediterranean diet Study
  • ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ (ఐబీఎస్) బాధితులకు మెడిటరేనియన్ డైట్‌ మేలు
  • అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైన కీలక విషయాలు
  • మెడిటరేనియన్ డైట్‌ తీసుకున్న 73 శాతం మందిలో లక్షణాలు తగ్గుముఖం
  • లో-ఫాడ్‌మ్యాప్ డైట్ కంటే మధ్యధరా డైట్ తక్కువ కఠినం
  • ఐబీఎస్ చికిత్సా విధానాల్లో మెడిటరేనియన్ డైట్‌ చేర్చవచ్చంటున్న నిపుణులు
ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ (ఐబీఎస్) సమస్యతో బాధపడుతున్న వారికి మధ్యధరా ప్రాంతపు ఆహార పద్ధతులు(మెడిటరేనియన్ డైట్‌) మేలు చేస్తాయని అమెరికాకు చెందిన పరిశోధకుల బృందం కనుగొంది. ఈ డైట్ ద్వారా ఐబీఎస్ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుందని వారి అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 నుంచి 11 శాతం మంది ప్రజలు ఐబీఎస్‌తో ఇబ్బంది పడుతున్నారు. వీరిలో ఎక్కువశాతం మంది మందుల కంటే ఆహార నియమాల ద్వారానే ఉపశమనం పొందడానికి ఇష్టపడతారు.

ప్రస్తుతం ఐబీఎస్ కోసం సూచిస్తున్న లో-ఫాడ్‌మ్యాప్ డైట్ సగానికి పైగా రోగులలో లక్షణాలను మెరుగుపరుస్తున్నప్పటికీ, ఇది చాలా కఠినంగా ఉండటంతో పాటు అనుసరించడం కూడా కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మిచిగాన్ మెడిసిన్ పరిశోధకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. తాజాగా "న్యూరోగ్యాస్ట్రోఎంటరాలజీ & మోటిలిటీ" జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం ఐబీఎస్ బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపుకు మెడిటరేనియన్ డైట్‌, మరో గ్రూపుకు లో-ఫాడ్‌మ్యాప్ ఆహారం ఇచ్చి పరిశీలించారు.

మెడిటరేనియన్ డైట్‌ తీసుకున్న వారిలో 73 శాతం మందిలో లక్షణాలు తగ్గుముఖం పట్టగా, లో-ఫాడ్‌మ్యాప్ డైట్ అనుసరించిన వారిలో 81.8 శాతం మందిలో ఉపశమనం కనిపించింది. అయితే, లో-ఫాడ్‌మ్యాప్ డైట్ ఖర్చుతో కూడుకున్నదని, సమయం ఎక్కువ తీసుకుంటుందని, పోషకాహార లోపాలు, ఈటింగ్ డిజార్డర్స్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మిచిగాన్ మెడిసిన్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రశాంత్ సింగ్ తెలిపారు. మెడిటరేనియన్ డైట్‌ ఈ పరిమితులను అధిగమిస్తుందని ఆయన అన్నారు.

గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, సాధారణ ఆరోగ్య ప్రయోజనాల రీత్యా మెడిటరేనియన్ డైట్‌ ఇప్పటికే వైద్య వర్గాల్లో ఆదరణ పొందింది. ఐబీఎస్‌పై దీని ప్రభావం గురించి గతంలో వచ్చిన ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రస్తుత అధ్యయనం ప్రకారం, లో-ఫాడ్‌మ్యాప్ డైట్ వల్ల కడుపు నొప్పి తీవ్రత, ఐబీఎస్ లక్షణాల తీవ్రత స్కోరులో ఎక్కువ మెరుగుదల కనిపించినప్పటికీ, మెడిటరేనియన్ డైట్‌ కూడా ప్రయోజనకరమైనదేనని స్పష్టమైంది. "ఐబీఎస్ రోగులకు సిఫార్సు చేయదగిన ఆహార చికిత్సల జాబితాలో మెడిటరేనియన్ డైట్‌ను చేర్చవచ్చనడానికి ఈ అధ్యయనం ఒక నిదర్శనం" అని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి విలియం చే పేర్కొన్నారు.
Mediterranean Diet
IBS
Irritable Bowel Syndrome
Low FODMAP diet
Prashant Singh
William Chey
gut health
digestion
Michigan Medicine
dietary treatment

More Telugu News