Andhra Pradesh Government: సొసైటీ సభ్యులను ప్రభుత్వం తొలగించలేదు: ఏపీ హైకోర్టు

AP High Court Gives Big Shock to AP Government
  • నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేయాలని కోరడం, పదవుల నుంచి తొలగించడాన్ని ఆక్షేపించిన హైకోర్టు
  • సొసైటీ బై లా నిబంధనలు అనుమతిస్తున్న సందర్భంలో మాత్రమే నామినేటెడ్ సభ్యులను పదవుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని స్పష్టం చేసిన  హైకోర్టు  
  • సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనం
సొసైటీ నామినేటెడ్ సభ్యుల తొలగింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చట్టం, సొసైటీ బైలా నిబంధనలు అనుమతిస్తున్న సందర్భంలో మాత్రమే నామినేటెడ్ సభ్యులను పదవుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. వారిని రాజీనామా చేయాలని కోరడం లేదా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది.

రాజకీయ కారణాలతో నామినేటెడ్ సభ్యులుగా నియమితులైన వారిని పదవుల నుంచి తొలగించే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది.

జిల్లా పశుగణాభివృద్ధి సంఘం (డీఎల్డీఏ) పాలకవర్గంలో నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేయాలని కోరడం, పదవుల నుంచి తొలగించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. సభ్యులను తొలగిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్, విజయనగరం, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.

ప్రకాశం జిల్లా పశుగణాభివృద్ధి సంఘ పాలకవర్గంలో ఉన్న తనను తొలగిస్తూ జిల్లా కలెక్టర్ గత ఏడాది జూన్ 15న ఉత్తర్వులు ఇచ్చారని కోసూరి రాధ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే తరహాలో తమను కూడా రాజీనామా చేయాలని అధికారులు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ విజయనగరం జిల్లాకు చెందిన బంగారునాయుడు, చిత్తూరు జిల్లాకు చెందిన సంతోష్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుందరరావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి.. నామినేటెడ్ సభ్యులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ తీర్పుపై రాధ తదితరులు ధర్మాసనం ముందు అప్పీల్ చేయగా, పై విధంగా తీర్పు వెలువరించింది. 
Andhra Pradesh Government
AP High Court
Society Nominated Members
Dheeraj Singh Thakur
Kosuri Radha
Pashuganaabhivruddhi Sangham
DLDA
Government Orders
Prakasam District
Political Appointments

More Telugu News