K Kavitha: కవిత వల్ల లాభం ఉంటే... ఆమెను చేర్చుకోవడానికి అభ్యంతరం ఎందుకు?: కె.కేశవరావు

K Kesava Rao on K Kavitha Joining Congress Party
  • కవిత కాంగ్రెస్ లో చేరితే పార్టీకి పెద్దగా లాభం ఉండదన్న కేకే
  • ఆమె మాటలను కాంగ్రెస్ లో ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని వ్యాఖ్య
  • ఆపరేషన్ కగారుపై శాంతి చర్చల ప్రతిపాదనను స్వాగతించాలన్న కేకే
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేరిక వల్ల పార్టీకి నిజంగా ప్రయోజనం ఉంటుందని భావిస్తే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని... అయితే ఆమె వల్ల పార్టీకి పెద్దగా మేలు జరుగుతుందని తాను అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేకే ఈ వ్యాఖ్యలు చేశారు. 

కవిత మాటలను కాంగ్రెస్ పార్టీలో ఎవరూ అంత సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తనకు అనిపించడం లేదని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీలోనే తన తుదిశ్వాస విడుస్తానని కేశవరావు తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖత చూపనందునే తాను పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరాల్సి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

'ఆపరేషన్ కగారు' అంశంపై కూడా ఆయన స్పందించారు. శాంతియుత చర్చలకు వస్తామని ఒకవైపు నుంచి ప్రతిపాదన వస్తే, దానిని ఎందుకు స్వాగతించకూడదని ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టే ఆపరేషన్ల గురించి తాను పార్లమెంటులోనే మాట్లాడానని గుర్తు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని కేకే డిమాండ్ చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఆరు యుద్ధాలు జరిగాయని, సైనిక చర్యలకు రాజకీయ ప్రమేయం ఎందుకని ఆయన నిలదీశారు. యుద్ధంలో గెలిచి పాకిస్థాన్‌కు బుద్ధి చెబుతామంటున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వంటి వారి మాటలతో కాల్పుల విరమణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

K Kavitha
Kalvakuntla Kavitha
K Kesava Rao
BRS
Congress Party
Telangana
Revanth Reddy
Operation Kagaz
Maoists
India Pakistan

More Telugu News