Emmanuel Macron: ‘అప్పుడు తలుపులు మూసుండాలి’.. మెక్రాన్ వీడియోపై ట్రంప్ సరదా వ్యాఖ్య

Trump Jests About Macron Video Incident
  • ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను భార్య నెట్టిన వీడియో వైరల్
  • ‘అలాంటివి జరిగినప్పుడు తలుపులు మూసున్నాయో లేదో చూసుకోవాలి’ అని ట్రంప్ చమత్కారం
  •  తాను మెక్రాన్‌తో మాట్లాడానని, అంతా బాగానే ఉందని చెప్పిన ట్రంప్
  •  అది తమ మధ్య జరిగిన సరదా సన్నివేశమని వివరణ ఇచ్చిన మెక్రాన్
  •  దీనిపై అనవసర కథనాలు అల్లుతున్నారని అసహనం 
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇటీవల ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టింది. ఆ వీడియోలో ఆయన భార్య బ్రిగెట్టా.. మెక్రాన్ ముఖాన్ని నెట్టివేసినట్టు కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ సరదా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఈ వీడియోపై మెక్రాన్ కూడా వివరణ ఇచ్చారు.

ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఒక విలేకరి ట్రంప్‌ను ఈ వైరల్ వీడియో గురించి ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. "ఈ విషయంపై నేను నేరుగా మెక్రాన్‌తో మాట్లాడాను, అంతా బాగానే ఉంది" అని తెలిపారు. అయితే, ఈ సందర్భంగా ఆయన చమత్కరిస్తూ "అలాంటి ఘటనలు జరిగేటప్పుడు తలుపులు సరిగ్గా వేసి ఉన్నాయో, లేదో ఒకసారి గమనించుకోవాలి" అని అన్నారు.

అసలేం జరిగింది?
ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, భార్య బ్రిగెట్టాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని ఫ్రెంచ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనికి బలం చేకూరుస్తూ వియత్నాం పర్యటనలో భాగంగా హనోయ్ విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. విమానం హనోయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఒక అధికారి తలుపు తెరిచినప్పుడు మెక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించారు. అదే సమయంలో ఎర్రటి స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మెక్రాన్‌ను నెట్టివేశాయి. దీంతో ఆయన వెంటనే తల తిప్పుకుని వెనక్కి జరిగారు. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డవుతున్నాయని గమనించి ఆయన చిరునవ్వుతో చేయి ఊపారు.

ఆ తర్వాత తీసిన ఫొటోల్లో, ఎర్రటి జాకెట్ ధరించిన బ్రిగెట్టా, మెక్రాన్‌తో కలిసి విమానం మెట్లపై కనిపించారు. మెక్రాన్ ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె సుముఖత చూపలేదు. అనంతరం ఇద్దరూ కలిసి మెట్లు దిగి, ఎర్ర తివాచీపై పక్కపక్కనే నడిచారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి.

మా మధ్య గొడవల్లేవు
ఈ వైరల్ వీడియోపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ స్వయంగా స్పందించారు. ఆ సందర్భాన్ని ప్రతి ఒక్కరూ తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని, అది కేవలం తమ మధ్య జరిగిన ఒక సరదా సన్నివేశమని స్పష్టం చేశారు. ఈ ఘటన చుట్టూ అనవసరమైన కథనాలు అల్లడంపై అసహనం వ్యక్తం చేశారు. "ఆ వీడియోలో నేను ఒక టిష్యూ తీసుకున్నాను. ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా భార్యతో జోక్ చేశాను. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగేదే" అని మెక్రాన్ వివరణ ఇచ్చారు. తమ వ్యక్తిగత క్షణాలను తప్పుగా చిత్రీకరించడం సరికాదని ఆయన హితవు పలికారు.
Emmanuel Macron
Macron
Brigitte Macron
Donald Trump
France
Vietnam
Hanoi
Viral Video
French Media
US President

More Telugu News