Valiveti Subhavati: ఏపీ నర్సుకు జాతీయ గౌరవం.. ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం అందుకున్న శుభావతి

AP Nurse Valiveti Subhavati Honored with Florence Nightingale Award
  • ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం ప్రదానం
  • కర్నూలు రీజినల్ హెల్త్ సెంటర్‌లో ఏఎన్‌ఎంగా శుభావతి సేవలు
  • ఉద్యోగ విరమణ తర్వాత కూడా ప్రజారోగ్యంపై విస్తృత అవగాహన
  • నర్సుల సేవలను కొనియాడిన కేంద్రమంత్రి జేపీ నడ్డా
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సు వలివేటి శుభావతి ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా అందజేసే నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును శుభావతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 15 మంది నర్సులను ఈ అవార్డుతో సత్కరించారు.

వలివేటి శుభావతి ప్రస్తుతం కర్నూలు రీజినల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్‌లో ఏఎన్‌ఎంగా సేవలందిస్తున్నారు. ఆమె తన 29 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో అంకితభావంతో సేవలు అందించారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా వైద్య విద్య శిక్షణ అధికారిగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆమె చేసిన కృషి విశేషమైనది. ఆరోగ్యం ఆవశ్యకతను వివరిస్తూ ఆమె సొంతంగా ఒక పాట రాసి, ఆలపించి విస్తృతంగా ప్రచారం చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా శుభావతి అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, లక్ష రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్న నర్సులందరికీ అభినందనలు తెలిపారు. నర్సుల నిస్వార్థ సేవలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని అన్నారు. ప్రతిరోజూ లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడుతున్న నర్సులే భారత వైద్య ఆరోగ్య వ్యవస్థకు మూలస్తంభాలని కొనియాడారు. వారి సేవలు వెలకట్టలేనివని, వారి అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
Valiveti Subhavati
Florence Nightingale Award
AP Nurse
Droupadi Murmu
Kurnool
JP Nadda
National Florence Nightingale Award
Andhra Pradesh
Nurse Award
Indian Nursing

More Telugu News