Ankita Bhandari: రిసార్టులో వ్యభిచారానికి నో.. రిసెప్షనిస్ట్ అంకితను కాలువలో తోసేసి చంపేశారు!

Ankita Bhandari Murder Case Verdict Resort Owner Guilty
  • ఉత్తరాఖండ్ లో అంకిత భండారీ హత్య కేసులో ముగ్గురు దోషులు
  • వ్యభిచారానికి ఒప్పుకోలేదని రిసెప్షనిస్ట్ అంకిత దారుణ హత్య
  • దాదాపు మూడేళ్ల తర్వాత బాధితురాలి కుటుంబానికి న్యాయం
  • పోలీసుల నిర్లక్ష్యం, రాజకీయ పలుకుబడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన కేసు
ఉత్తరాఖండ్‌కు చెందిన యువ రిసెప్షనిస్ట్ అంకితా భండారీ హత్య కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. దాదాపు మూడేళ్లపాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం, రిసార్ట్ యజమాని పులకిత్‌ ఆర్యతో పాటు మరో ఇద్దరు నిందితులు సౌరభ్‌ భాస్కర్‌, అంకిత్‌ గుప్తాలను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఉద్యోగంలో చేరిన 19 ఏళ్ల అంకిత, యాజమాన్యం చెప్పిన అసాంఘిక కార్యకలాపాలకు అంగీకరించనందునే ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

ఏం జరిగింది?

ఉత్తరాఖండ్‌లోని పౌడీ గఢ్వాల్‌ జిల్లా డోబ్‌-శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకితా భండారీ (19) అనే యువతి 2022 ఆగస్టులో రిషికేశ్‌ సమీపంలోని ఓ రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఆ రిసార్టును అప్పటి బీజేపీ సీనియర్ నేత వినోద్ ఆర్య కుమారుడు పులకిత్‌ ఆర్య నడుపుతున్నాడు. ఉద్యోగంలో చేరిన నెల రోజులకే అంకిత అదృశ్యమైంది. రిసార్టుకు వచ్చే వీఐపీ అతిథుల కోసం వ్యభిచారం చేయాలని పులకిత్‌ ఆర్య, రిసార్ట్ సిబ్బంది సౌరభ్‌ భాస్కర్, అంకిత్ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఈ "ప్రత్యేక సేవల"ను ఆమె నిరాకరించడంతో వివాదం చెలరేగింది. అనంతరం నిందితులు ఆమెను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని రిషికేష్‌ దగ్గరలోని చిల్లా కాలువలో తోసివేశారు. అనంతరం ఏమీ ఎరుగనట్లు రిసార్టుకు తిరిగివచ్చారు.

స్నేహితుడి చొరవతో వెలుగులోకి దారుణం

అంకిత హత్యకు గురికావడానికి కొన్ని గంటల ముందు తన స్నేహితుడైన పుష్ప్‌తో మాట్లాడి నిందితులు తనపై తెస్తున్న ఒత్తిడి గురించి వివరించింది. అదే రోజు రాత్రి పుష్ప్‌ ఆమెకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అనుమానంతో పులకిత్ ఆర్యను, ఇతర సిబ్బందిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. మరుసటి రోజు నుంచి పులకిత్ ఆర్య ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ కావడంతో పుష్ప్‌కు అనుమానం బలపడింది. వెంటనే అతను అంకిత కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచిత్రంగా అంకితను హత్య చేసిన పులకిత్ ఆర్య కూడా ఆమె కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టడం గమనార్హం.

శారీరకంగా హింసించినట్లు పోస్టుమార్టం నివేదిక

అంకిత ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు మొదట్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రిసార్ట్ ఉన్న ప్రాంతం రెవెన్యూ పోలీసుల పరిధిలోకి వస్తుంది. వీరికి సాధారణ పోలీసులతో పోలిస్తే దర్యాప్తు అధికారాలు, నైపుణ్యాలు పరిమితంగా ఉండటంతో కేసు దర్యాప్తు ఆలస్యమైంది. బాధితురాలి కుటుంబం, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల తర్వాత కేసును సాధారణ పోలీసులకు బదిలీ చేశారు. అప్పటి డీజీపీ అశోక్ కుమార్ కూడా ఈ జాప్యాన్ని అంగీకరించారు. ఆరు రోజుల తర్వాత చిల్లా కాలువలో అంకిత మృతదేహం లభ్యమైంది. కాలువలో కొట్టుకుపోవడం వల్లే అంకిత మరణించిందని, లైంగిక దాడి జరగనప్పటికీ ఆమెను శారీరకంగా హింసించారని పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది.

ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితులను తరలిస్తున్న పోలీసు వాహనంపై దాడి చేసి వారిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. రిసార్ట్‌పై కూడా దాడి జరిగింది. నిందితులను ప్రభుత్వం కాపాడుతోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ రిసార్టును అక్రమంగా నిర్మించారంటూ ప్రభుత్వం రాత్రికిరాత్రే బుల్డోజర్‌తో కూల్చివేయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో వినోద్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది.

మరోవైపు నిందితులు కేసును అంకిత స్నేహితుడైన పుష్ప్‌పై నెట్టేందుకు విఫలయత్నం చేశారు. అంకిత అంత్యక్రియల సమయంలోనూ ఆటంకాలు సృష్టించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో సత్వర విచారణకు హామీ ఇవ్వడంతో ఆందోళనలు కొంతమేర చల్లారాయి. ఈ కేసులో మే 19న కోర్టులో తుది వాదనలు ముగియగా మే 30న న్యాయస్థానం తీర్పును వెలువరించింది. పులకిత్‌ ఆర్య, సౌరభ్‌ భాస్కర్‌, అంకిత్‌ గుప్తాలను దోషులుగా తేల్చింది. అయితే పులకిత్ తండ్రి వినోద్ ఆర్య మాత్రం తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, అతనికి నేర స్వభావం లేదని పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. పులకిత్, అంకిత ఇద్దరికీ న్యాయం జరగాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
Ankita Bhandari
Uttarakhand
Rishikesh
Pulkit Arya
Vinod Arya
murder case

More Telugu News