Surveen Chawla: అప్పటికే నాకు పెళ్లయింది... కాస్టింగ్ కౌచ్ అనుభవాలు వెల్లడించిన బాలీవుడ్ నటి

Surveen Chawla Reveals Casting Couch Experiences After Marriage
  • పెళ్లయిన తర్వాత కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలు
  • ముంబై డైరెక్టర్ ఆఫీసులో అసభ్య ప్రవర్తన
  • సౌత్ దర్శకుడి నుంచి లైంగిక వేధింపుల ప్రతిపాదన
  • శరీరాకృతిపై దారుణమైన కామెంట్స్ ఎదుర్కొన్న వైనం
  • సినిమా పరిశ్రమలోని చీకటి కోణాలపై సుర్వీన్ నిర్మొహమాటం
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా సినిమా పరిశ్రమలోని చీకటి కోణాల గురించి, ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటికప్పుడు ధైర్యంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఆమె తనకు ఎదురైన కొన్ని దిగ్భ్రాంతికరమైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను, ముఖ్యంగా పెళ్లయిన తర్వాత జరిగిన ఓ సంఘటనను పంచుకుని సంచలనం సృష్టించారు.

ఇటీవల 'ది మేల్ ఫెమినిస్ట్' అనే పాడ్‌కాస్ట్‌లో సుర్వీన్ చావ్లా మాట్లాడుతూ, తాను వివాహం చేసుకున్న తర్వాత కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురయ్యానని తెలిపారు. ముంబైలోని వీరా దేశాయ్ రోడ్డులో ఉన్న ఓ దర్శకుడి ఆఫీసులో జరిగిన సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. "ఆఫీసు క్యాబిన్‌లో మీటింగ్ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగింది. అప్పటికే నాకు పెళ్లయింది. మీటింగ్‌లో నా వైవాహిక జీవితం ఎలా ఉంది, నా భర్త ఏం చేస్తారు అనే విషయాలు కూడా అతడు అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు క్యాబిన్‌లో మేమిద్దరమే ఉన్నాం. ఇక బై చెప్పి వెళ్లే సమయంలో, ఆయన నా వైపు వంగి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. నేను షాక్‌కు గురై, ఆయన్ని వెనక్కి నెట్టి ఏం చేస్తున్నారని ప్రశ్నించి అక్కడి నుంచి వచ్చేశాను. అయినప్పటికీ అతడు గేటు వరకు వచ్చాడు" అని సుర్వీన్ ఆ భయానక అనుభవాన్ని వివరించారు.

మరో సంఘటనను ప్రస్తావిస్తూ, ఓ జాతీయ అవార్డు గ్రహీత అయిన సౌత్ సినిమా దర్శకుడు సినిమా షూటింగ్ సమయంలో తనతో పాటు పడుకోవాలని కోరుకుంటున్నట్లు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తనకు చెప్పించాడని సుర్వీన్ ఆరోపించారు. ఈ రెండు సంఘటనలు పరిశ్రమలోని కొందరి ప్రవర్తన ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేస్తున్నాయని ఆమె అన్నారు.

సినిమా పరిశ్రమలో, ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి కూడా సుర్వీన్ మాట్లాడారు. ఇప్పుడు కొంచెం హుందాగా చెబుతున్నారు కానీ, నా టైంలో ముఖం మీదే అనేసేవారు. నేను కూడా వారికి ముఖం మీదే సమాధానం ఇచ్చేదాన్ని అని ఆమె తెలిపారు.

గతంలో ఆర్‌జే సిద్ధార్థ్ కనన్‌తో జరిగిన ఓ సంభాషణలో కూడా సుర్వీన్ సినిమా రంగంలోని బాడీ షేమింగ్ ట్రెండ్‌పై స్పందించారు. "మిమ్మల్ని అభద్రతాభావానికి గురిచేయడమే వారి పని అన్నట్లుగా ప్రవర్తిస్తారు. మీ బరువు, నడుము సైజు, ఛాతీ సైజు.. ఇలా ప్రతీదాన్నీ ప్రశ్నిస్తారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సుర్వీన్ చావ్లా కెరీర్ - నేపథ్యం
సుర్వీన్ చావ్లా 2003లో 'కహిన్ తో హోగా' అనే టీవీ షోతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. హిందీ, పంజాబీ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఆమె, 2014లో 'హేట్ స్టోరీ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 2008లో 'పరమేశ పాన్వాలా' అనే కన్నడ చిత్రంతో పాటు 'రాజు మహారాజు' (తమిళం), 'మూండ్రు పేర్ మూండ్రు కాదల్' (తెలుగు) వంటి చిత్రాల్లో కూడా నటించారు. 'ధర్తీ', 'హీరో నామ్ యాద్ రఖీ' వంటి పంజాబీ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'పార్చ్డ్', 'హమ్ తుమ్ షబానా', 'అగ్లీ', 'సేక్రేడ్ గేమ్స్', 'ఛురీ' (షార్ట్ ఫిల్మ్) ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు.

రాబోయే ప్రాజెక్టులు
సుర్వీన్ చావ్లా ఇటీవల పంకజ్ త్రిపాఠితో కలిసి నటించిన 'క్రిమినల్ జస్టిస్ సీజన్ 4' విడుదలైంది. ప్రస్తుతం ఆమె 'రానా నాయుడు సీజన్ 2' కోసం సిద్ధమవుతున్నారు. ఇది జూన్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Surveen Chawla
Bollywood
Casting Couch
South Indian Movies
Body Shaming
Criminal Justice Season 4
Rana Naidu Season 2
Mumbai
Parched
Hate Story 2

More Telugu News