Nadendla Manohar: సీఏ కావాలనుకుని మంత్రి అయ్యాను: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar Wanted to be CA
  • సీఏ విద్యార్థుల జాతీయ సదస్సులో మంత్రి నాదెండ్ల ప్రసంగం
  • రాజకీయ నాయకులకు సీఏలు, లాయర్ల అవసరం తప్పనిసరి అని వ్యాఖ్య
  • త్వరలో ఏపీకి అంతర్జాతీయ కంపెనీలు రాబోతున్నాయన్న మంత్రి
తాను కూడా చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కావాలని ఆశించి, ఆర్టికల్స్ కూడా పూర్తి చేశానని, కానీ చివరికి రాజకీయ నాయకుడినయ్యానని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో జరిగిన ఐసీఏఐ జాతీయ విద్యార్థుల సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొన్ని లెక్కలకు సంబంధించి ఆరేళ్ల తర్వాత ఆడిటింగ్ నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ప్రభుత్వ లెక్కల విషయంలో ఇంత జాప్యం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా న్యాయవాది సహాయం కచ్చితంగా అవసరమని ఆయన పేర్కొన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారితం నుంచి సాంకేతికత ఆధారితంగా రూపాంతరం చెందుతోందని మంత్రి తెలిపారు. కొనుగోలు శక్తిలో మన దేశం జపాన్‌ను అధిగమించిందని చెప్పారు. రాష్ట్రానికి త్వరలో అనేక అంతర్జాతీయ సంస్థలు, గ్లోబల్ చైన్లు రానున్నాయని, వాటికి సీఏల సేవలు ఎంతగానో అవసరమని అన్నారు. "ఈ ఏడాది చివరి నాటికి భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది" అని ఆయన అంచనా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మనోహర్ వెల్లడించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడిస్తున్నామని, వాట్సాప్ ద్వారా పంట కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తే 74 వేల మంది రైతులు నమోదు చేసుకోగా, 18 వేల మంది తమ పంటను విజయవంతంగా అమ్ముకున్నారని తెలిపారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి తెస్తామని, రైతులు విక్రయించిన ధాన్యం బస్తాలకు క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రజలను కూడా పీ4 (ప్రజా భాగస్వామ్యం)లో భాగస్వాములను చేయడానికి కారణం, వారు కూడా దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని చెప్పడానికేనని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 
Nadendla Manohar
AP Minister
Chartered Accountant
ICAI
Vijayawada
Andhra Pradesh Economy
Chandrababu Naidu
Pawan Kalyan
Quantum Valley
Smart Ration Cards

More Telugu News