Tiger Kingdom: భారత పర్యాటకుడిపై పులి దాడి.. థాయ్ లాండ్ లో ఘటన.. వీడియో ఇదిగో!

Indian Tourist Attacked by Tiger in Thailand Tiger Kingdom
  • పుకెట్ టైగర్ పార్కులో భయానక సంఘటన.. భారతీయుడిపైకి దూకిన పులి
  • దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • స్వల్ప గాయాలతో పర్యాటకుడు బయటపడ్డారని సమాచారం
థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత టైగర్ కింగ్‌డమ్‌ను సందర్శించిన భారతీయ పర్యాటకుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. పులితో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఉండగా అది ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. భారతీయ పర్యాటకుడు పుకెట్ లోని టైగర్ కింగ్‌డమ్‌లో ఒక పులి పక్కన నడుస్తూ, ఫోటో కోసం కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ట్రైనర్ ఒకరు కర్ర సాయంతో పులిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, అనూహ్యంగా ఆ పులి పర్యాటకుడిపైకి లంఘించింది. ఈ దృశ్యాలను సిద్దార్థ్ శుక్లా అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేశారు.

"థాయ్‌లాండ్‌లో ఒక భారతీయ పర్యాటకుడిపై పులి దాడి చేసినట్లు తెలుస్తోంది. టైగర్ కింగ్‌డమ్‌లో పులులకు తగిన శిక్షణ ఇస్తారు. తగిన రుసుము వసూలు చేసి పులితో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు పర్యాటకులకు అవకాశం కల్పిస్తారు. ఇలా శిక్షణ ఇచ్చిన పులితో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలోనే ఈ దాడి జరిగింది" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పులి దాడి నుంచి సదరు పర్యాటకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడని సిద్దార్థ్ శుక్లా కామెంట్స్ విభాగంలో తెలిపారు.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, జంతువుల సంక్షేమంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. "ఎప్పుడూ ఇలాంటి సాహసాలకు పోవద్దు. జంతువులు జంతువులే. వాటి పట్ల దయగా ఉండండి, కానీ అవి కూడా అలాగే స్పందిస్తాయని ఆశించవద్దు" అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. బంధించి ఉంచిన వన్యప్రాణులతో దగ్గరగా మెలగడాన్ని అనుమతించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి విమర్శకులు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అసహజ పరిస్థితుల్లో ఉంచడం వల్ల అవి ప్రమాదకరంగా ప్రవర్తించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tiger Kingdom
Thailand
Indian tourist
tiger attack
Phuket
wildlife safety
animal welfare
tiger selfie

More Telugu News