Raghunandan Rao: బీఆర్ఎస్ తో పొత్తు మాకేం అవసరం?.. బీజేపీ నేత రఘునందన్ రావు

Raghunandan Rao Says BJP Does Not Need BRS Alliance
  • ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం చెల్లని రూపాయిగా మారారని ఎద్దేవా
  • బీఆర్ఎస్ తో తెలంగాణ ప్రజలకు ఉపయోగంలేదని వ్యాఖ్య
  • తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబ ఆస్తులు మాత్రమే పెరిగాయని విమర్శలు
  • పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడంటూ కేటీఆర్ పై ఆరోపణలు
బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ప్రయత్నం జరిగిందని, ఇందుకోసం చర్చలు జరిపారని ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాజాగా స్పందించారు. బీఆర్ఎస్ కుటుంబ కలహాలలోకి కవిత బీజేపీని లాగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ప్రస్తుతం కవిత చెల్లని రూపాయిగా మారారని విమర్శించారు. ఆ పార్టీలో, కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత గొడవలలోకి కవిత బీజేపీని లాగుతోందని ఆరోపించారు.

బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఆ దిశగా ఎలాంటి చర్చలు జరపలేదని రఘునందన్ రావు తేల్చిచెప్పారు. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని కవిత ఆరోపించిందని గుర్తుచేశారు. ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. కవిత వ్యక్తిత్వహననానికి పాల్పడుతుంది ఎవరనేది తేల్చాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెయిడ్ బ్యాచ్ ను మెయింటెయిన్ చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. దాదాపు 20 యూట్యూబ్ ఛానల్స్ కు కేటీఆర్ జీతాలు ఇస్తున్నారని, తన పత్రికలోనూ తప్పుడు కథనాలను ప్రచురించేలా చేస్తున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుందని రఘునందన్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ తో అంటకాగుతూ 2014 లో ఆ పార్టీని విలీనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని గుర్తుచేశారు. కుటుంబం మొత్తం ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లపై పడ్డారని చెప్పారు. బీఆర్ఎస్ వల్ల తెలంగాణ ప్రజలకు రూపాయి ప్రయోజనం కూడా లేకుండా పోయిందని చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు సైతం రూపాయి కూడా దక్కలేదని రఘునందన్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబ ఆస్తులు మాత్రమే పెరిగాయని ఆరోపించారు.

అందుకే బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇలాంటి కుటుంబ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో బీజేపీ సొంతంగానే ఎదుగుతోందని రఘునందన్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ బీజేపీ ప్రజలకు చేరువ అవుతోందని తెలిపారు.
Raghunandan Rao
BRS
BJP
Kavitha
Telangana
KTR
Revanth Reddy
BJP BRS alliance
Telangana politics

More Telugu News