Saifullah Kasuri: భారత్‌పై విషం కక్కిన సైఫుల్లా కసూరి: పాక్‌లో బహిరంగంగా ఉగ్రవాదుల ప్రసంగాలు

Saifullah Kasuri spews venom on India at Pakistan rally
  • లాహోర్‌లో జరిగిన ర్యాలీలో లష్కరే ఉగ్రవాది సైఫుల్లా కసూరి
  • భారత్‌పై మరోసారి విద్వేషపూరిత ప్రసంగం
  • పంజాబ్ అసెంబ్లీ స్పీకర్‌తో వేదిక పంచుకున్న కసూరి
  • హాజరైన హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ 
  • నిషేధిత లష్కరే తోయిబా పీఎంఎంఎల్ ముసుగులో కార్యక్రమాలు
  • పాక్ అణు పరీక్షల వార్షికోత్సవం పేరిట సభ
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తమ భారత వ్యతిరేకతను బహిరంగంగా ప్రదర్శించారు. ప్రభుత్వ ప్రతినిధులతో వేదికను పంచుకుంటూ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. లాహోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫుల్లా కసూరి పాల్గొని భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కాడు. పంజాబ్‌ అసెంబ్లీ ప్రావిన్షియల్‌ స్పీకర్‌ మాలిక్‌ అహ్మద్‌ ఖాత్‌ ఈ కార్యక్రమానికి హాజరై కసూరితో పాటు వేదికపై ఆసీనులవడం గమనార్హం.

పాకిస్థాన్‌ అణు పరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌ (పీఎంఎంఎల్) లాహోర్‌లో ఈ ర్యాలీని నిర్వహించింది. ఈ సభలో సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించిన సైఫుల్లా కసూరి భారత్‌పై విమర్శలు చేశాడు. "పహల్గామ్ ఉగ్రదాడికి నన్ను మాస్టర్‌మైండ్‌ అనడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాను" అని కసూరి వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత బలగాల దాడిలో మరణించిన ఉగ్రవాది ముదస్సిర్‌ అహ్మద్‌ పేరు మీద పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అల్హాఅబాద్‌లో పలు నిర్మాణాలు చేపడతానని కూడా ప్రకటించాడు. ఈ ర్యాలీలో పెద్దయెత్తున భారత వ్యతిరేక నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడిన హఫీజ్‌ సయీద్‌ కుమారుడు, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది తల్హా సయీద్‌ కూడా పాలుపంచుకున్నాడు. ఇతను కూడా తన ప్రసంగంలో భారత వ్యతిరేకతను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. గతంలో లాహోర్‌లోని నేషనల్‌ అసెంబ్లీ 122వ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తల్హా సయీద్, లష్కరే రాజకీయ విభాగమైన పీఎంఎంఎల్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తుంటాడు. పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాపై అధికారికంగా నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ఆ సంస్థ పీఎంఎంఎల్ అనే ముసుగులో తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది.
Saifullah Kasuri
Pakistan
India
Lashkar-e-Taiba
Hafiz Saeed
Talha Saeed
Terrorism

More Telugu News