Bharat MP: అది కదా తెలుగు వారి ఆత్మ గౌరవం అనిపించింది: టీడీపీ ఎంపీ భరత్

Bharat MP Speaks on Telugu Pride at TDP Mahanadu
  • కడపలో టీడీపీ మహానాడు
  • హాజరైన ఎంపీ భరత్
  • చంద్రబాబుపై ప్రశంసలు
ఒకప్పుడు విమర్శించిన నేతలే ఇప్పుడు చంద్రబాబు పాలనను పొగుడుతున్నారని టీడీపీ ఎంపీ భరత్ అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కడప ఆతిథ్యం గురించి మాట్లాడుతూ, "మూడు రోజుల కడప ఆతిథ్యం ఎలా ఉంటుందో అనుకున్నాను. మా మిత్రుడి ఇంట్లో మూడు రోజులు ఉన్నాను. నన్నారీ షర్బత్ ఇచ్చారు, కారం దోశ తినిపించారు. ఈ ఆతిథ్యం మరువలేనిది" అని భరత్ పేర్కొన్నారు. 

కడప గండికోట వంటి ప్రాంతాలు దేశంలో పెద్దగా ఎవరికీ తెలియవని, ఇలాంటి చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రతి 10 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం పర్యాటక రంగంలోనే ఉంటుందని భరత్ వివరించారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఒక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద సిగ్నల్ దగ్గర జామకాయలు అమ్ముతున్న మహిళ వద్ద ఓ ప్రయాణికురాలు రూ.150 విలువైన జామకాయలు కొనుగోలు చేసి, రూ.200 ఇచ్చింది. అంటే రూ.50 ఎక్కువ ఇచ్చి ఉంచుకోమని చెప్పింది. అయితే జామకాయలు అమ్మే మహిళ రూ.50 తిరిగి ఇచ్చేయడమే కాకుండా, మరో రెండు జామకాయలు అదనంగా ప్రయాణికురాలికి ఇచ్చిందని, ఇది తెలుగువారి నిజాయతీకి నిదర్శనమని భరత్ కొనియాడారు.  అమెరికాలో మా అబ్బాయితో టూర్ కి వెళ్లా... ఒక ట్యాక్సీ డ్రైవర్ హోటల్ కు తీసుకెళ్లారు. ఆ 15 నిమిషాల ప్రయాణంలో ఒక ఆఫ్రికా దేశం నుంచి బానిసగా వచ్చి వ్యక్తి ప్రధాని ఎలా అయ్యారో నాకు వివరించారు... పర్యాటకంలో కొన్ని విషయాలు జీవితాంతం మనల్ని తీసుకెళతాయని అన్నారు. 

చంద్రబాబు దార్శనికత వల్లే హైదరాబాద్ పర్యాటకంగా అభివృద్ధి చెందిందని, 'క్లీన్ హైదరాబాద్' కార్యక్రమం ఎంతో విజయవంతమైందని భరత్ గుర్తుచేశారు. ఇప్పుడు 'స్వచ్ఛ మహానాడు' ద్వారా ఇక్కడ కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య 9 కోట్ల నుంచి 23 కోట్లకు పెరిగిందని, ఆ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

గత వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ భరత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అరకు కాఫీ కాస్తా అరకు డ్రగ్స్‌గా మారింది. రుషికొండను బోడి గుండు చేయడం అత్యంత బాధాకరం. ఇలాంటి విధ్వంసకర పనులు అనేకం జరిగాయి," అని ఆరోపించారు. బోటు టూరిజాన్ని, విశాఖ ఉత్సవ్ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేశారని విమర్శించారు. "కశ్మీర్‌లో టూరిస్టులపై టెర్రరిస్టులు దాడి చేస్తే, మన రాష్ట్రంలో వైసీపీ ఉగ్రవాదులు పర్యాటక రంగంపై ఆర్థిక విధ్వంసం చేశారు. రూ.500 కోట్లతో రుషికొండలో బంగళా కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు," అని తీవ్ర ఆరోపణలు చేశారు.

నేడు చంద్రబాబు మళ్లీ అరకు కాఫీకి పూర్వ వైభవం తీసుకొచ్చారని, వైజాగ్‌కు క్రూయిజ్ నౌక వచ్చిందని, ఇది అండమాన్ వరకు కూడా వెళుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


Bharat MP
TDP Mahanadu
Andhra Pradesh Tourism
Chandrababu Naidu
Kadapa
Visakhapatnam
Araku Coffee
Rushikonda
Telugu Pride
Tourism Development

More Telugu News