Yudao Chemical: చైనా కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. వీడియో ఇదిగో!

Yudao Chemical Plant Explosion in China
  • షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కంపెనీలో పేలుడు
  • ఆకాశంలోకి భారీగా ఎగసిన దట్టమైన పొగ, అగ్నికీలలు
  • 55 వాహనాలతో 232 మంది సిబ్బందితో రెస్క్యూ
  • గావోమి పట్టణంలోని యూదావో ప్లాంట్‌లో ఘటన
తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక రసాయన కర్మాగారంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కర్మాగారం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లగా, ప్రాణనష్టంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు వెల్లడించాయి.

చైనా న్యూస్ ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం.. బీజింగ్‌కు సుమారు 450 కిలోమీటర్ల దూరంలోని గావోమి పట్టణంలో ఉన్న యూదావో కెమికల్ ప్లాంట్‌లో మంగళవారం ఉదయం 11:57 గంటలకు (భారత కాలమానం ఉదయం 9:27) ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను బీజింగ్‌కు చెందిన జిన్‌జింగ్‌బావో మీడియా ప్రసారం చేసింది. ఆ వీడియోలలో భారీగా బూడిద రంగు పొగ మేఘాలు ఆకాశంలోకి లేవడం, పారిశ్రామిక ప్రాంతంలో మంటలు చెలరేగడం స్పష్టంగా కనిపించాయి. పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాల కిటికీలు పగిలిపోయినట్లు తెలుస్తోంది.

కొన్ని క్లిప్‌లలో రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాల గుట్టలు, ధ్వంసమైన కార్లు కనిపించాయి. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ 55 అగ్నిమాపక వాహనాలను, 232 మంది సహాయక సిబ్బందిని ఘటనా స్థలానికి తరలించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

యూదావో కెమికల్ కంపెనీ పురుగుమందులను తయారు చేస్తుంది. సుమారు 116 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్‌లో దాదాపు 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చైనాలో పారిశ్రామిక వాడలోని చాలా కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను సరిగా పాటించడం లేదని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని ఆరోపణలు ఉన్నాయి. 2015లో టియాంజిన్ ఓడరేవు నగరంలోని రసాయన కంపెనీ గోడౌన్ లో సంభవించిన వరుస పేలుళ్లలో 170 మందికి పైగా మరణించగా, 700 మంది గాయపడ్డారు.
Yudao Chemical
China chemical plant explosion
Shandong province
Gaomi explosion
China factory blast
Chemical plant accident
Industrial safety China
Tianjin explosion

More Telugu News