Ramya: తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడంపై రమ్య విమర్శలు

Ramya Criticizes Tamannaah as Mysore Sandal Soap Brand Ambassador
  • మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా
  • తమన్నాను ఎంచుకోవడంపై రమ్య ఆగ్రహం
  • ప్రభుత్వ నిర్ణయం సమంజసం కాదని వ్యాఖ్య
ప్రముఖ నటి తమన్నాను కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలోని మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య (దివ్య స్పందన) తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నడ భాషా ఉద్యమాలు ఊపందుకుంటున్న తరుణంలో, స్థానికులను కాదని తమన్నాను ఎంపిక చేయడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

కర్ణాటకలో ప్రస్తుతం కన్నడ భాష పరిరక్షణ ఉద్యమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా తమన్నాను నియమించడం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై నటి రమ్య ఘాటుగా స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

తమన్నా నియామకం సరైన నిర్ణయం కాదని రమ్య తన పోస్టులో పేర్కొన్నారు. "ప్రస్తుతం మన కన్నడ భాష కోసం పోరాడుతున్నాం. కానీ కొన్నిసార్లు మన ప్రాధాన్యతలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అనిపిస్తోంది. స్థానికతను మనం మరిచిపోతున్నట్లుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మైసూర్ శాండల్ సోప్ అనేది కేవలం ఒక సబ్బు మాత్రమే కాదని, అది కన్నడ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని రమ్య అన్నారు. "నిజానికి దానికి ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు. ఒకవేళ తప్పనిసరిగా నియమించాలనుకుంటే, స్థానికంగా ఉన్న మాలాంటి వారిని పరిగణించాలి. అంతేగానీ, ఉత్తరాది వినియోగదారులను ఆకర్షించడం కోసం తమన్నాని ఎంచుకోవడం సమంజసంగా లేదు" అని ఆమె అభిప్రాయపడ్డారు.

తాను వ్యక్తిగతంగా తమన్నాకు వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే, "మనం మన ప్రాంతీయ భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ సమయంలో, కన్నడ ప్రజల సెంటిమెంట్‌ను బయటి వారి చేతుల్లో పెట్టడం సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఉన్న కన్నడ వారిని ప్రభుత్వం దూరం చేసుకుంటున్నట్లే. ఇది మాకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది" అని రమ్య తెలిపారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Ramya
Tamannaah
Mysore Sandal Soap
Divya Spandana
Karnataka
Kannada
Brand Ambassador
Controversy
Local Talent
Kannada Language

More Telugu News