Asaduddin Owaisi: పాకిస్థాన్ పరువు తీసేసిన అసదుద్దీన్ ఒవైసీ.. వీడియో ఇదిగో!

Asaduddin Owaisi Exposes Pakistan Lies in Kuwait Speech
  • ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ లను స్టుపిడ్ జోకర్లు అంటూ మండిపడ్డ ఒవైసీ
  • కనీసం కాపీ కొట్టడం కూడా రాని దద్దమ్మలంటూ ఎద్దేవా
  • షరీఫ్ కు పాక్ ఆర్మీ చీఫ్ బహుకరించిన ఫొటోపై విమర్శలు
  • 2019లో చైనా సైనిక విన్యాసాల ఫొటోను ఉపయోగించారని వెల్లడి
  • కువైట్‌లో భారతీయ సమాజంతో మాట్లాడుతూ ఓవైసీ వ్యాఖ్యలు
అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుటిల నీతిని ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా కువైట్ లో పర్యటిస్తున్న ఎంపీల బృందంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కువైట్ లోని భారత సంతతి పౌరులను ఉద్దేశించి అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ఈ సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ లపై ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం కాపీ కొట్టడం కూడా రాని దద్దమ్మలంటూ ఎద్దేవా చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన సైనిక చర్యకు సంబంధించి తప్పుడు జ్ఞాపికను ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు. వారిని "తెలివి తక్కువ జోకర్లు" (స్టుపిడ్ జోకర్స్) అంటూ ఘాటుగా విమర్శించారు.

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్‌'కు ప్రతిగా తాము 'ఆపరేషన్ బున్యాన్-ఉన్-మర్సూస్' నిర్వహించామని, అందులో విజయం సాధించామని చాటుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఓ జ్ఞాపికను అందజేశారు. అయితే, ఆ జ్ఞాపికలో ఉన్న పెయింటింగ్, చైనా సైనిక విన్యాసాలకు సంబంధించినదని ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరైనట్లు సమాచారం.

అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పాకిస్థాన్ పరువు తీసేశారు. "ఈ తెలివి తక్కువ జోకర్లు భారత్‌తో పోటీ పడాలనుకుంటున్నారు. 2019 నాటి చైనా ఆర్మీ డ్రిల్ ఫోటోను ఇచ్చి, భారత్‌పై విజయమని చెప్పుకుంటున్నారు. పాకిస్థాన్ ఇలాంటి పనులే చేస్తుంది. కనీసం సరైన ఫోటోను కూడా బహుమతిగా ఇవ్వలేకపోయారు" అని ఒవైసీ దుయ్యబట్టారు. "నకల్ కొట్టడానికి కూడా అకల్ (తెలివి) కావాలని చిన్నప్పుడు స్కూలులో వినేవాళ్లం. ఈ పనికిమాలిన దద్దమ్మల దగ్గర ఆ తెలివి కూడా లేదు" అంటూ హిందీలో వ్యాఖ్యానించారు.

అంతా ఫేక్ ప్రచారమే..
పాకిస్థాన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ఇది మొదటిసారి కాదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. మే 15న పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్, ఓ బ్రిటిష్ వార్తాపత్రికలో వచ్చినట్లుగా ఓ నకిలీ కథనాన్ని చూపిస్తూ తమ వైమానిక దళాన్ని పొగిడిన ఉదంతం కూడా వివాదాస్పదమైంది. ఆ కథనం నకిలీదని 'డాన్' పత్రిక నిజ నిర్ధారణలో తేల్చింది. మే 7న పహల్గామ్ దాడికి ప్రతిగా భారత బలగాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' కింద కచ్చితత్వంతో కూడిన దాడులు చేసిన తర్వాత, పాక్ సైన్యం మే 8, 9, 10 తేదీలలో భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించి, భారత మౌలిక సదుపాయాలకు భారీ నష్టం కలిగించామని ప్రకటించగా, ఆ వాదనలను భారత్ ఖండించింది.
Asaduddin Owaisi
Pakistan
Shahbaz Sharif
Asim Munir
China military drill
Operation Sindoor
Fake news Pakistan
India Pakistan relations
Pak Army Chief
Indian MP

More Telugu News