Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హ్యాట్రిక్... గెలుపుతో సీజన్ కు సైనింగ్ ఆఫ్!

Sunrisers Hyderabad Signs Off Season With Victory
  • ఢిల్లీలో సన్ రైజర్స్ × కేకేఆర్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 278 పరుగులు
  • హెన్రిచ్ క్లాసెన్ అద్భుత శతకం
  • భారీ లక్ష్యఛేదనలో కోల్ కతా 168 ఆలౌట్
ఐపీఎల్-2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంతో ముగించింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించారు. 279 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కోల్ కతా చేతులెత్తేసింది. 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అయింది. సునీల్ నరైన్ 31, మనీష్ పాండే 37, హర్షిత్ రాణా 34 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో హర్ష్ దూబే 3, జయదేవ్ ఉనద్కట్ 3, ఎషాన్ మలింగ 3 వికెట్లతో సత్తా చాటారు. 

ఓ దశలో 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ జట్టు స్కోరు ఇంతవరకు వచ్చిందంటే అది మనీష్ పాండే, హర్షిత్ రాణాల చలవే. భారీ షాట్లతో విజృంభించిన వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు 50 పరుగులు జోడించారు. అయితే మనీష్ పాండేను జయదేవ్ ఉనద్కట్ అవుట్ చేయడంతో కేకేఆర్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోల్ కతా ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 

ఇక, ఇటీవల ఐపీఎల్-2025 పునఃప్రారంభమయ్యాక సన్ రైజర్స్ ఆట మామూలుగా లేదు. వరుసగా మూడు మ్యాచ్ ల్లో నెగ్గి తన ట్రేడ్ మార్క్ కు న్యాయం చేసింది. అయితే, ప్లే ఆఫ్ కు చేరలేకపోవడం ఒక్కటే లోటు. అయినప్పటికీ, అభిమానులకు అవసరమైన వినోదాన్ని అందించడంలో మాత్రం సన్ రైజర్స్ రూటే వేరు. ఇవాళ కూడా 250కి పైగా స్కోరు చేసి టీ20 క్రికెట్ కు సిసలైన అర్థం చెప్పింది. 

తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ పై సూపర్ విక్టరీతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి ఎగబాకడం విశేషం. సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు, 7 ఓటములు నమోదు చేసింది. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
Sunrisers Hyderabad
SRH
IPL 2025
Kolkata Knight Riders
KKR
Manish Pandey
Harshit Rana
Arun Jaitley Stadium
Hyderabad
T20 Cricket

More Telugu News