Novak Djokovic: జ‌కోవిచ్ అరుదైన ఘ‌న‌త‌... @ 100 టైటిల్స్

Novak Djokovic Wins 100th Career Title at Geneva Open
  • జెనీవా ఓపెన్ కైవ‌సం చేసుకున్న జ‌కోవిచ్ 
  • కెరీర్‌లో వందో సింగిల్స్ టైటిల్ గెలుకున్న సెర్బియన్ స్టార్
  • అత‌ని కంటే ముందు జిమ్మీ కాన‌ర్స్ (109), రోజ‌ర్ ఫెద‌ర‌ర్ (103) మాత్ర‌మే ఈ ఘ‌న‌త
సెర్బియా టెన్నిస్ స్టార్ ప్లేయ‌ర్ నొవాక్ జ‌కోవిచ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. జెనీవా ఓపెన్‌లో విజ‌యంతో కెరీర్‌లో 100 టైటిళ్ల మైలురాయిని చేరుకున్నాడు. శనివారం జరిగిన జెనీవా ఓపెన్ ఫైన‌ల్లో హుబెర్ట్ హుర్కాజ్‌ను 5-7, 7-6 (2), 7-6 (2) తేడాతో ఓడించి జకోవిచ్ తన కెరీర్‌లో 100వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు.

విజ‌యం త‌ర్వాత సెర్బియన్ స్టార్ మాట్లాడుతూ... "ఇక్కడ 100వ సింగిల్స్ టైటిల్‌ సాధించినందుకు ఆనందంగా ఉంది. నేను దాని కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మ్యాచ్ మొత్తంలో హుబెర్ట్ నాకన్నా విజయానికి దగ్గరగా ఉన్నాడు. అతను తన సర్వ్‌ను ఎలా బ్రేక్ చేశాడో నాకు తెలియదు. హుబెర్ట్ 4-3 ఆధిక్యంలో ఉన్నప్పుడు బహుశా తనను తాను బ్రేక్ చేసుకుని ఉండవచ్చు. అత‌డు చాలా అద్భుతంగా ఆడాడు. ఇది చాలా ట‌ఫ్ ఫైట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు" అని జకోవిచ్ అన్నాడు. 

ఇక‌, ఈ విజ‌యంతో టెన్నిస్ చ‌రిత్ర‌లో వంద టైటిల్స్ అందుకున్న మూడో ఆట‌గాడిగా జ‌కోవిచ్‌ నిలిచాడు. అత‌ని కంటే ముందు జిమ్మీ కాన‌ర్స్ (109), రోజ‌ర్ ఫెద‌ర‌ర్ (103) మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌లో 99వ టైటిల్ గెలిచిన తర్వాత జ‌కోవిచ్ తన చివరి రెండు ఫైనల్స్ లో ఓడిపోవడంతో 100 టైటిళ్ల‌ మైలురాయిని సాధించ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టింది. 2006లో తన తొలి టైటిల్ గెలుచుకున్న జ‌కోవిచ్... ఇప్పుడు 20 వేర్వేరు సీజన్లలో టైటిళ్లు గెలుచుకున్న తొలి ఓపెన్-ఎరా ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

కాగా, ఈ వారాంతంలో ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టివ‌రకు జ‌కోవిచ్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచాడు. దాంతో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై క‌న్నేశాడు. సోమవారం అతను అమెరికాకు చెందిన‌ మెకెంజీ మెక్‌డొనాల్డ్‌తో తన తొలి మ్యాచ్ ఆడ‌నున్నాడు.


Novak Djokovic
Djokovic
tennis
Geneva Open
Hubert Hurkacz
Grand Slam
French Open
Jimmy Connors
Roger Federer

More Telugu News