Ryanair: పెంచిన జీతం వెనక్కి ఇవ్వాలంటూ ఉద్యోగులకు నోటీసులు పంపిన కంపెనీ

Ryanair Asks Employees to Return Increased Salaries After Court Order
  • స్పెయిన్ ఎయిర్ లైన్స్ కంపెనీ రయన్‌ఎయిర్ సిబ్బంది కష్టాలు
  • కోర్టు తీర్పుతో జీతాల పెంపు ఒప్పందం రద్దు
  • పేస్లిప్ నుంచి డబ్బులు మినహాయిస్తామని ప్రకటన
ప్రముఖ ఐరిష్ విమానయాన సంస్థ రయన్‌ఎయిర్ తన సిబ్బందికి షాకిచ్చింది. ఇటీవల పెంచిన జీతాలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. జీతాల పెంపు ద్వారా ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 2.8 లక్షల వరకు అందుకున్నారని, ఆ మొత్తాన్ని వెంటనే కంపెనీ ఖాతాలో జమ చేయాలని పేర్కొంది. లేదంటే నెలనెలా జీతంలో కోత పెడతామని స్పష్టం చేసింది. జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగ సంఘంతో కుదుర్చుకున్న ఒప్పందం చెల్లదని కోర్టు తీర్పు ఇవ్వడంతో కంపెనీ ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

రయన్ఎయిర్ ఉద్యోగులకు సంబంధించి రెండు యూనియన్లు ఉన్నాయి. అందులో ఒకటైన 'సీసీఓఓ'తో రయన్ఎయిర్ వేతన పెంపు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మేరకు సిబ్బంది జీతాలను పెంచింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రత్యర్థి సంఘం ‘యూఎస్ఓ’ కోర్టులో సవాల్ చేసింది. విచారణ జరిపిన కోర్టు.. జీతాల పెంపునకు సంబంధించి 'సీసీఓఓ'తో రయన్ఎయిర్ కుదుర్చుకున్న ఒప్పందం చెల్లదని తీర్పు వెలువరించింది. దీంతో జీతాల పెంపు ద్వారా అందుకున్న సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని రయన్ఎయిర్ తన సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.

ఈ పరిణామంపై యూఎస్ఓ కార్మిక సంఘం ప్రతినిధి ఎస్టర్ పెయ్రో గాల్డ్రాన్ మాట్లాడుతూ.. కంపెనీ నోటీసులపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. వేతన పెంపునకు సంబంధించిన ఒప్పందంపై చర్చలు జరిపిన వారికి, తమ సభ్యుల తరఫున సంతకాలు చేసే అధికారం లేదని ఆరోపించారు. కంపెనీ తమ సంఘంలోని సభ్యులను సీసీఓఓలో చేరాలని ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. మరోవైపు, రయన్‌ఎయిర్ ప్రతినిధి మాట్లాడుతూ, "యూఎస్‌ఓ జీతాలు తగ్గించాలని కోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం ఆ కేసు అప్పీల్‌లో ఉంది. మేము కోర్టు ఆదేశాలను పాటిస్తున్నాము" అని తెలిపారు.
Ryanair
Ryanair employees
Irish airline
salary deduction
wage dispute
CCOO union
USO union
Ester Peydro Galadron
labor union
court order

More Telugu News