United Nations: ఉగ్రవాద దాడుల్లో 20వేల‌ మంది భారతీయుల మృతి.. ఐక్యరాజ్యసమితిలో మ‌రోమారు పాక్‌ను ఎండ‌గ‌ట్టిన‌ భారత్

Parvathaneni Harish Exposes Pakistans Role in Terrorism at UN
  • సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ తప్పుడు సమాచారం ఇచ్చింద‌న్న‌ భారత్‌ 
  • పాక్‌ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం కారణంగానే 65 ఏళ్ల నాటి ఒప్పందాన్ని నిలిపివేసినట్లు వెల్ల‌డి
  • "నీరు ప్రాణం, యుద్ధ ఆయుధం కాదు" అన్న పాక్‌ ప్రతినిధి   
  • ఘాటుగా స్పందించిన‌ ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌
  • గత 4దశాబ్దాలలో ఉగ్రవాద దాడుల్లో 20వేల‌ మందికి పైగా భారతీయులు మరణించార‌ని వ్యాఖ్య‌
  • పాక్ కుట్ర‌పూరిత చర్యలు పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తూనే ఉన్నాయ‌ని ఆవేద‌న‌
గత నెల 22న‌ జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన పాశ‌విక‌ ఉగ్రవాద దాడి తర్వాత తాత్కాలికంగా రద్దు చేయబడిన సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ "తప్పుడు సమాచారం" అందించిందని భారత్‌ తీవ్రంగా విమర్శించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం కారణంగా 65 ఏళ్ల నాటి ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్‌ తెలిపారు.

పాక్‌ ప్రతినిధి ఐక్యరాజ్యసమితిలో ఈ ఒప్పంద అంశాన్ని లేవనెత్తారు. "నీరు ప్రాణం, యుద్ధ ఆయుధం కాదు" అని అన్నారు. దీంతో రాయబారి హరీశ్ ఘాటుగా స్పందించారు. 1960లో సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో 26 మంది మరణించిన ఒక రోజు తర్వాత భారత్‌ నిలిపివేసింది. ఈ భయంకరమైన ఉగ్రదాడికి సరిహద్దు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్న తర్వాత భార‌త ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

"ఆరున్నర దశాబ్దాలుగా భారతదేశంపై పాకిస్థాన్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రవాద దాడులను చేయడం ద్వారా సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించింది. గత నాలుగు దశాబ్దాలలో  ఉగ్రవాద దాడుల్లో 20,000 మందికి పైగా భారతీయులు మరణించారు. భారత్‌లో పాక్‌ ప్రభుత్వ ప్రాయోజిత సరిహద్దు ఉగ్రవాదం పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక శ్రేయస్సును ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేసింది.

2012లో జమ్మూకాశ్మీర్‌లోని తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. పాక్ కుట్ర‌పూరిత చర్యలు మా ప్రాజెక్టుల భద్రతకు, పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి. గత రెండు సంవత్సరాలలో అనేక సందర్భాల్లో సవరణలను చర్చించాలని భారత్‌ అధికారికంగా పాక్‌ను కోరింది. కానీ, దాయాది దేశం వీటిని తిరస్కరిస్తూనే ఉంది. 

భారతదేశం చట్టబద్ధమైన హక్కులను పూర్తిగా ఉపయోగించుకోకుండా పాకిస్థాన్ అడ్డంకి ధోరణి కొనసాగుతోంది. 
ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పాకిస్థాన్... సరిహద్దు ఉగ్రవాదానికి తన మద్దతును విశ్వసనీయంగా, పూర్తిగా ముగించే వరకు ఈ ఒప్పందం నిలిపివేయబడుతుంది" అని హరీశ్ వివ‌రించారు.

పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పాశ‌విక దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం మే 7న 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. పాక్‌, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడుల‌తో విరుచుకుప‌డింది.

ఆ తరువాత పాకిస్థాన్ భారీ క్షిపణి, డ్రోన్ దాడిని ప్రారంభించింది. కానీ వాటిని భార‌త బ‌ల‌గాలు తిప్పికొట్టాయి. పాక్ దాడుల‌కు ప్రతీకారంగా భారత దళాలు పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడి చేశాయి. ఈ క్ర‌మంలో మే 10న ఇరుదేశాల మ‌ధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుద‌ర‌డంతో ఉద్రిక్త‌త‌ల‌కు తెర‌ప‌డింది.
United Nations
Parvathaneni Harish
India
Pakistan
terrorism
Indus Waters Treaty
Jammu Kashmir
Pahalgam attack
Operation Sindoor
ceasefire agreement

More Telugu News