AP DSC: ఏపీలో మెగా డీఎస్సీకి లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

AP DSC Exam to Proceed as Scheduled Supreme Court Dismisses Petition
  • డీఎస్సీ వాయిదా కోరుతూ పిటిషన్లు దాఖలు
  • పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు 
  • ఏవైనా సమస్యలుంటే హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచన
  • జూన్ 6 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ పరీక్షలు యథాతథం
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) షెడ్యూల్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరుగుతాయని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

వివరాల్లోకి వెళితే, ఏపీలో డీఎస్సీ, టెట్ పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని అభ్యర్థిస్తూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం, అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో తగిన కారణాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఉంటే, వాటి పరిష్కారం కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది. ఫలితంగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన డీఎస్సీ, టెట్ షెడ్యూల్ యథావిధిగా అమలవుతుందని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. ఈ నోటిఫికేషన్ ప్రకారం, జూన్ 6వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది.
AP DSC
Andhra Pradesh DSC
DSC Exam
TET Exam
Supreme Court
Teacher Recruitment
Education Department
Teacher Eligibility Test
AP TET

More Telugu News