Kavitha: భర్త నుంచి విడిపోవాలని.. పసికందును బావిలో పడేసిన తల్లి

Kavitha Arrested for Killing Baby in Siddipet Telangana
  • దుబ్బాక మండలం అప్పనపల్లిలో 80 రోజుల పసికందు హత్య
  • కన్నతల్లే హంతకురాలని నిర్ధారించిన పోలీసులు
  • మొదట కిడ్నాప్ కథ అల్లి, తర్వాత నేరం ఒప్పుకున్న మహిళ
  • భర్తతో విభేదాలే ఈ ఘాతుకానికి కారణమని వెల్లడి
  • నిందితురాలైన తల్లిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు
తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో మానవత్వం మంటగలిసే ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. కన్నపేగు బంధాన్ని విస్మరించి, ఒక తల్లి తన 80 రోజుల పసికందును అత్యంత కిరాతకంగా బావిలో పడేసి ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటన అప్పనపల్లి గ్రామంలో బుధవారం జరగగా, గురువారం పసికందు మృతదేహాన్ని వెలికితీశారు. తొలుత తన బిడ్డను గుర్తు తెలియని దుండగులు అపహరించారని కట్టుకథలు అల్లిన ఆ తల్లి, పోలీసుల విచారణలో అసలు నిజాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

దుబ్బాక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగళ్ళ శ్రీమాన్, నంగునూరు మండలం నర్మెట్టకు చెందిన కవితను మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు పుల్లూరులోనే నివాసం ఉంటున్నాడు. శ్రీమాన్ ఇటీవల రెండు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని భావించి, గత రెండు నెలలుగా దుబ్బాక మండలం అప్పనపల్లిలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు.

అయితే, కవిత జీవితంలో ఆనందం కరువైంది. భర్త శ్రీమాన్ తరచూ వేధింపులకు గురిచేయడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, అతని ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చకపోవడంతో కవిత తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో భర్త నుంచి విడిపోయి, ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకుంది.

తన నిర్ణయానికి పసిబిడ్డ అడ్డుగా ఉన్నాడని భావించిన కవిత, బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 80 రోజుల కుమారుడు దీక్షిత్ కుమార్‌ను తీసుకుని గ్రామ శివారులోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేసి తిరిగి వచ్చింది. అనంతరం ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు వచ్చి తన కుమారుడిని ఎత్తుకెళ్లారని అందరినీ నమ్మించి, పోలీసులకు కిడ్నాప్ జరిగిందని ఫిర్యాదు చేసి తప్పుదోవ పట్టించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కవిత చెబుతున్న మాటలకు, సంఘటనా స్థలంలోని ఆధారాలకు పొంతన లేకపోవడంతో అనుమానించాడు. ఆమెను క్షుణ్ణంగా విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్త వేధింపులు భరించలేక, అతని నుంచి దూరంగా వెళ్లిపోవాలనే ఉద్దేశంతో, అడ్డుగా ఉన్న కుమారుడిని తానే బావిలో పడేసి చంపినట్లు కవిత అంగీకరించింది. దీంతో ఆమె భర్త శ్రీమాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసును హత్య కేసుగా మార్పు చేసి, కవితను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Kavitha
Siddipet
Dubbaka
Infanticide
Telangana
Crime
Husband harassment

More Telugu News