Stock Markets: నిన్నటి భారీ నష్టాల నుంచి అంతే వేగంగా కోలుకున్న మార్కెట్లు

Stock Markets Recover Quickly After Yesterdays Losses
  • భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
  • నిన్నటి నష్టాల నుంచి పూర్తిగా కోలుకున్న సూచీలు
  • సెన్సెక్స్ 769 పాయింట్లు, నిఫ్టీ 243 పాయింట్లు వృద్ధి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను నమోదు చేశాయి. నిన్న ఎదురైన తీవ్ర నష్టాల నుంచి సూచీలు ఈరోజు అంతే వేగంగా కోలుకున్నాయి. అమెరికా బాండ్ల రాబడులు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌కు ఊతమిచ్చింది. ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా మోస్తరు లాభాలను ఆర్జించాయి.

ఈరోజు ఉదయం సెన్సెక్స్ 80,897.00 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. క్రితం ముగింపు 80,951.99 పాయింట్లతో పోలిస్తే కొంత తక్కువగా ట్రేడింగ్ మొదలైనప్పటికీ, కొద్దిసేపటికే లాభాల బాట పట్టింది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, ఇంట్రాడేలో ఏకంగా 900 పాయింట్లకు పైగా లాభపడి 81,905.17 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరికి, సెన్సెక్స్ 769.09 పాయింట్ల లాభంతో 81,721.08 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ కూడా 243.45 పాయింట్లు లాభపడి 24,853.15 వద్ద ముగిసింది. దీంతో నిఫ్టీ మళ్లీ 24,800 మార్కు పైకి చేరింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ గణనీయంగా బలపడింది. 72 పైసలు పెరిగి 85.23 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలోని సన్‌ఫార్మా షేరు మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో పయనించాయి. ముఖ్యంగా ఎటర్నల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు ఎక్కువగా లాభపడిన వాటిలో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 64.38 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3,327 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Stock Markets
Sensex
Nifty
Share Market
Indian Economy
Rupee Dollar
Brent Crude Oil
Gold Price
Stock Market News

More Telugu News