Krishnendu Das: పన్నెండేళ్ల బాలుడి ప్రాణం తీసిన చిప్స్ పాకెట్.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ లెటర్

12 Year Kid Suicide Note Reveals Chips Packet Theft Accusation
  • చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన దుకాణం యజమాని
  • బహిరంగంగా గుంజీలు తీయించిన వైనం.. పశ్చిమ బెంగాల్‌లో ఘటన
  • తల్లి కూడా దూషించడంతో బలవన్మరణానికి పాల్పడ్డ బాలుడు
  • తాను దొంగతనం చేయలేదంటూ సూసైడ్ లేఖ
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని ఆరోపిస్తూ షాపు యజమాని ఓ పన్నెండేళ్ల బాలుడిపై చేయిచేసుకున్నాడు. అందరి ముందూ గుంజీలు తీయించాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తల్లి కూడా కొట్టడంతో బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి వెళ్లగానే తన గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. తలుపులు బద్దలు కొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ‘నేను దొంగను కాదు’ అంటూ బాలుడు రాసిన ఆత్మహత్య లేఖ చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం సాయంత్రం పాన్‌స్కురా ప్రాంతంలోని గోసాయిబేర్ బజార్‌లో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఏడో తరగతి చదువుతున్న క్రిషెందు దాస్ అనే విద్యార్థి చిప్స్ ప్యాకెట్ కొనేందుకు స్థానికంగా ఉన్న దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో దుకాణ యజమాని శుభంకర్ దీక్షిత్ అక్కడ లేడు. "అంకుల్, చిప్స్ తీసుకుంటున్నా" అని క్రిషెందు చాలాసార్లు పిలిచినా ఎవరూ సమాధానం ఇవ్వలేదని, దాంతో బాలుడు చిప్స్ ప్యాకెట్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయాడని మృతుడి తల్లి కన్నీటిపర్యంతమవుతూ పోలీసులకు తెలిపింది.

కొద్దిసేపటికే దుకాణానికి తిరిగొచ్చిన యజమాని దీక్షిత్ బాలుడిని వెంబడించి పట్టుకున్నాడు. అందరి ముందూ క్రిషెందును చెంపదెబ్బ కొట్టి, గుంజీలు తీయించాడు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బాలుడి తల్లి కూడా అతన్ని మందలించి, కొట్టింది. తాను దుకాణం ముందు పడి ఉన్న కుర్‌కురే ప్యాకెట్‌ను మాత్రమే తీసుకున్నానని, తర్వాత డబ్బులు చెల్లిద్దామనుకున్నానని బాలుడు చెప్పాడు. వెంటనే డబ్బులు చెల్లిస్తానని, క్షమించమని వేడుకున్నా దుకాణదారు నమ్మలేదు, అబద్ధం చెబుతున్నావని నిందించాడు.

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైన క్రిషెందు, తల్లితో కలిసి ఇంటికి వెళ్ళాడు. తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి, స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా, క్రిషెందు నోటి నుంచి నురగలు వస్తూ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

అతని పక్కనే సగం ఖాళీ అయిన పురుగుల మందు డబ్బా, అతను బెంగాలీలో రాసిన ఓ లేఖ కనిపించాయి. "అమ్మా, నేను దొంగను కాదు. నేను ఏమీ దొంగిలించలేదు. నేను వెళ్లినప్పుడు అంకుల్ (దుకాణదారు) అక్కడ లేడు. తిరిగి వస్తుంటే రోడ్డుపై కుర్‌కురే ప్యాకెట్ కనిపిస్తే తీసుకున్నా. నాకు కుర్‌కురే అంటే చాలా ఇష్టం. ఇవే నా చివరి మాటలు. నన్ను క్షమించు" అని ఆ లేఖలో రాసి ఉంది. క్రిషెందును హుటాహుటిన తమ్లూక్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే బాలుడు మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత దుకాణ యజమాని పరారయ్యాడు.
Krishnendu Das
West Bengal
suicide
chips packet
shopkeeper
kurkure
theft accusation
crime
schoolboy

More Telugu News