MrBeast: 27 ఏళ్లకే వేల కోట్లు సంపాదించిన యూట్యూబర్.. మిస్టర్‌బీస్ట్

MrBeast Becomes a Billionaire at 27
  • ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబర్‌గా రికార్డు
  • ఆయన నికర ఆస్తి విలువ సుమారు రూ. 8300 కోట్లు
  • అంతా తనే సంపాదించానని, చనిపోయేలోపు అంతా దానం చేస్తానని ప్రకటన
యూట్యూబ్ సంచలనం, మిస్టర్‌బీస్ట్‌ గా పేరొందిన జిమ్మీ డొనాల్డ్సన్ తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు. 27 సంవత్సరాల వయసులోనే బిలియనీర్ల జాబితాలో చేరి సంచలనం సృష్టించాడు. సెలబ్రిటీ నెట్ వర్త్ అంచనాల ప్రకారం, ఆయన నికర ఆస్తి విలువ ప్రస్తుతం 1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,300 కోట్లు) చేరుకుంది. ఇందులో ఎలాంటి వారసత్వ ఆస్తి లేదు. అంటే.. ఆయన ఈ వేల కోట్ల రూపాయలను సొంతంగా, కేవలం 27 ఏళ్ల వయసులోనే సంపాదించారన్నమాట.

చిన్న వయసులోనే యూట్యూబర్ గా ప్రయాణం మొదలుపెట్టిన మిస్టర్‌బీస్ట్.. వినూత్నమైన ఛాలెంజ్‌లు, భారీ స్థాయిలో బహుమతులు ఇవ్వడం, దాతృత్వ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2017లో "ఐ కౌంటెడ్ టు 100,000" అనే వీడియోతో ఆయనకు విస్తృత ప్రాచుర్యం లభించింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని వీడియోల నిర్మాణానికే ఖర్చు చేస్తూ, కంటెంట్ నాణ్యతను పెంచుకుంటూ వెళ్లారు.

యూట్యూబ్ ద్వారానే కాకుండా, "బీస్ట్ బర్గర్" అనే ఫాస్ట్ ఫుడ్ చైన్, "ఫీస్టబుల్స్" అనే చాక్లెట్ కంపెనీ వంటి విజయవంతమైన వ్యాపారాలను కూడా మిస్టర్‌బీస్ట్ నిర్వహిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదికల ప్రకారం, 2023లో ఆయన ఆదాయం 223 మిలియన్ డాలర్లు. జూన్ 2024 నాటికి, యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన వ్యక్తిగా కూడా మిస్టర్‌బీస్ట్ రికార్డు సృష్టించారు.

సంపాదనతో పాటు దాతృత్వంలోనూ మిస్టర్‌బీస్ట్‌ ముందుంటారు. "బీస్ట్ ఫిలాంత్రోపీ" పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేల మందికి కంటి చూపునివ్వడం, లక్షల కొద్దీ మొక్కలు నాటించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. "చనిపోయేలోపు నా దగ్గరున్న ప్రతీ పైసా దానం చేస్తాను" అని మిస్టర్‌బీస్ట్‌ గతంలోనే ప్రకటించారు. తన జీవిత లక్ష్యం బాగా డబ్బు సంపాదించి, దాన్నంతటినీ మంచి పనుల కోసం ఖర్చు చేయడమేనని ఆయన పలు సందర్భాల్లో తెలిపారు.
MrBeast
Jimmy Donaldson
YouTuber
billionaire
Beast Burger
Feastables
YouTube
philanthropy
content creator
internet celebrity

More Telugu News