Kethy Chui: 'వంద బిలియన్ల కోడలు'.. నటికి మామ వేల కోట్ల కానుకలు

Kethy Chui Receives Billion Dollar Gifts From Father in Law
  • హాంగ్‌కాంగ్‌కు నటి కేతీ చుయికి మామ నుంచి భారీ కానుకలు
  • బహుమతుల విలువ సుమారు రూ.2,209 కోట్లు 
  • మామగారు లీ షావ్‌కీ హాంకాంగ్‌లో రెండో అత్యంత సంపన్నుడు
హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త కేతీ చుయి వార్తల్లో నిలిచారు. ఆమె తన మామ నుంచి వేల కోట్ల రూపాయల విలువైన బహుమతులు అందుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కానుకల మొత్తం విలువ సుమారు 257 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.2,209 కోట్లకు సమానం.

'ఆసియా వారెన్ బఫెట్'గా పేరుగాంచిన లీ షావ్‌కీ

కేతీ చుయి మామ మరెవరో కాదు, హాంకాంగ్‌లో రెండో అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన రియల్ ఎస్టేట్ దిగ్గజం లీ షావ్‌కీ. 'ఆసియా వారెన్ బఫెట్'గా ప్రసిద్ధి చెందిన ఆయన, హెండర్సన్ ల్యాండ్ డెవలప్‌మెంట్ సంస్థలో ప్రధాన వాటాదారు. ఈ ఏడాది మార్చి 17న, 97 సంవత్సరాల వయసులో లీ షావ్‌కీ కన్నుమూశారు. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం, ఆయన మరణించే సమయానికి ఆయన ఆస్తి విలువ 29.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

లీ షావ్‌కీకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన చిన్న కుమారుడైన మార్టిన్ లీ భార్యే ఈ కేతీ చుయి. 2006లో మార్టిన్‌ లీతో కేతీ వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. వివాహానికి ముందు నటిగా రాణించిన కేతీ, ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సేవా కార్యక్రమాల్లో ఆమె చూపిన చొరవకు అనేక పురస్కారాలు కూడా దక్కాయి.

కోడలికి విలువైన బహుమతులు

లీ షావ్‌కీ తన కోడలు కేతీ చుయికి ఎన్నో విలువైన బహుమతులు అందించారని సమాచారం. వాటిలో ఒక విలాసవంతమైన నౌక, ఒక విలాస భవనం, ఆమె నలుగురు పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఫండ్, అలాగే మిలియన్ల డాలర్ల విలువైన భూమి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కేతీ చుయి బిడ్డకు జన్మనిచ్చిన ప్రతీసారి లీ షావ్‌కీ ఆమెకు అత్యంత విలువైన కానుకలు ఇచ్చేవారని చెబుతారు. 2015లో కేతీ తన చివరి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, లీ షావ్‌కీ ఆనందంతో తన కంపెనీ ఉద్యోగులకు కూడా భారీగా నగదు బహుమతులు ఇవ్వడం విశేషం. ఈ సంఘటన తర్వాత స్థానిక మీడియాలో కేతీ చుయి పేరు 'హండ్రెడ్ బిలియన్ డాటర్-ఇన్‌-లా' (వంద బిలియన్ల కోడలు)గా మారుమోగిపోయింది.
Kethy Chui
Lee Shau Kee
Hong Kong
Henderson Land Development
Martin Lee
Asian Warren Buffett

More Telugu News