Zia ul Hassan Lanjar: పాక్ లో మంత్రి ఇంటిని తగలబెట్టిన నిరసనకారులు.. వీడియో ఇదిగో!

Minister Home Torched in Pakistan Protests
  • సింధు జలాల మళ్లింపుపై సింధ్ ప్రావిన్స్ లో ఆందోళనలు
  • పలు వాహనాలకు నిప్పు, జాతీయ రహదారి దిగ్బంధం
  • పోలీసుల లాఠీచార్జ్, కాల్పులతో ఇద్దరు మృతి
  • ఆగ్రహంతో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు
పాకిస్థాన్ లో సింధు జలాల మళ్లింపుపై రైతులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేశారు. గాయాలపాలైన వారినీ వదలకుండా ఆసుపత్రిలోకి వెళ్లి మరీ చేయిచేసుకున్నారు. లాఠీచార్జికి, కాల్పులకు ఆదేశాలిచ్చారనే అనుమానంతో నౌషేరో ఫిరోజ్ జిల్లాలోని మోరో తాలూకాలో ఉన్న సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లాంజర్ ఇంటిపై ఆందోళనకారులు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. అనంతరం హోంమంత్రి నివాసానికి నిప్పు పెట్టారు.

ట్రక్కులు లూటీ..
ఈ హింసాత్మక ఘటనల్లో ఆందోళనకారులు పలు ట్రక్కులను లూటీ చేసి, ఒక ఆయిల్ ట్యాంకర్‌తో సహా కనీసం మూడు వాహనాలకు నిప్పుపెట్టారు. యూరియా బస్తాలతో వెళ్తున్న ఓ ట్రక్కు నుంచి బస్తాలను కిందకు విసిరేయగా, కొందరు వాటిని తీసుకెళ్లారు. పెట్రోల్ పంపు కార్యాలయంపై దాడి చేసి నగదు దోచుకున్నారని, పోలీసులపై కర్రలతో దాడి చేశారని స్థానిక మీడియా తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులు, ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. శాంతిభద్రతల పునరుద్ధరణకు నవాబ్‌షా, సుక్కూర్ నుంచి అదనపు పోలీసు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు.

నిరసనలకు కారణం ఇదే..
సింధ్ రాష్ట్రంలో తాగు, సాగు నీటికి సింధు నదీ జలాలే ప్రధాన ఆధారం. ఇటీవల నదీప్రవాహం తగ్గడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి నెలకొంది. ఇదే సమయంలో పంజాబ్ రాష్ట్ర తాగునీటి అవసరాలను తీర్చేందుకు సింధు జలాలను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరు కెనాల్ లను నిర్మించాలని తలపెట్టింది. దీంతో సింధ్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింధు జలాలను మళ్లిస్తే తాము తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుందని, తమ పంట పొలాలు బీడువారుతాయని అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం కెనాల్ నిర్మాణంపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రజలు ఆందోళనలకు దిగారు.
Zia ul Hassan Lanjar
Pakistan protests
Sindh water dispute
Indus River
water diversion
Nawabshah
Sukkur
Punjab canals
farmers protest

More Telugu News