Arunachal Pradesh Exam: అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్

Arunachal Pradesh Exam Haryana Answers High Tech Copying
  • నవోదయ ఉద్యోగ పరీక్షల్లో చీటింగ్.. 53 మంది అభ్యర్థుల అరెస్ట్
  • చెవిలో చిన్న పరికరం అమర్చుకుని కాపీ కొడుతూ దొరికిన అభ్యర్థులు
  • దేశంలోని ఇతర కేంద్రాల్లోనూ ఇలాంటి ఘటనలపై విచారణ
అరుణాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన నియామక పరీక్షలో హైటెక్ కాపీయింగ్ మోసం వెలుగుచూసింది. ఇటానగర్ లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు 2,600 కిలోమీటర్ల దూరంలోని హర్యానా నుంచి ఆన్సర్లు చెబుతున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. నవోదయ విద్యాలయ సమితి నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షలో ఈ మోసం బయటపడింది. ఇటానగర్ పరీక్ష కేంద్రంలో ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో కాపీ కొడుతూ ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. అనుమానంతో మిగతా అభ్యర్థులను తనిఖీ చేయగా.. 53 మంది అభ్యర్థుల చెవులలో అతిచిన్న ఎలక్ట్రానిక్ పరికరం ఉన్నట్లు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆ 53 మంది అభ్యర్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఈ నెల 18న సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయ సమితిలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం అధికారులు ఇటానగర్‌లోని వీకేవీ చింపూ, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్‌ లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన ల్యాబ్ అటెండెంట్ పరీక్ష సమయంలో, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్‌లో ఒక అభ్యర్థి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జరిపిన సోదాలో సదరు అభ్యర్థి వద్ద చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, అతి సూక్ష్మమైన ఇయర్‌పీస్ లభ్యమయ్యాయి.

దీంతో ఆ కేంద్రంలో పరీక్ష రాస్తున్న మిగతా అభ్యర్థులనూ తనిఖీ చేయగా.. 23 మంది అభ్యర్థుల వద్ద అలాంటి పరికరాలు లభ్యమయ్యాయి. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివేకానంద కేంద్ర విద్యాలయ కేంద్రంలోనూ తనిఖీలు జరిపారు. రెండు కేంద్రాల్లో మొత్తం 53 మంది అభ్యర్థులను అరెస్టు చేసినట్లు, వారి నుంచి 29 ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

ఈ మోసం వెనుక పెద్ద ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పరీక్షల్లో సులువుగా ఉత్తీర్ణత సాధించేలా చేస్తామని నమ్మించి, భద్రతా లోపాలు ఎక్కువగా ఉండే మారుమూల ప్రాంతాలను పరీక్షా కేంద్రాలుగా ఎంచుకోవాలని ఈ ముఠా అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తోంది. అడ్మిట్ కార్డులు జారీ అయ్యాక, జీఎస్ఎం ఆధారిత పరికరాలను అందించి, వాటిని రహస్యంగా ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చారని పోలీసులు వివరించారు.

చీటింగ్ చేసిందిలా..
"లోదుస్తులలో ఎలక్ట్రానిక్ పరికరాన్ని దాచిపెట్టి, కంటికి కనిపించని అతి చిన్న ఇయర్‌పీస్‌ను చెవిలోపల అమర్చుకుంటారు. దీని ద్వారా బయట ఉన్న వ్యక్తులతో నిరంతరాయంగా సంభాషిస్తారు. మొదట, తమకు ఏ సెట్ ప్రశ్నపత్రం వచ్చిందో అభ్యర్థులు దగ్గుల రూపంలో సంకేతాలిస్తారు. దానికి అవతలి వ్యక్తి సమాధానాలు చెబుతాడు" అని మోసం జరిగిన తీరును పోలీసులు వివరించారు. ప్రశ్నపత్రం కూడా లీక్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దిమాపూర్, సిక్కిం, డెహ్రాడూన్‌లోని ఇతర కేంద్రాలలో కూడా చీటింగ్ జరిగినట్లు నివేదికలు అందాయని, వాటిపై కూడా దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. హర్యానాలోని జింద్ ప్రాంతం నుంచి ఈ కుంభకోణానికి సూత్రధారులు చక్రం తిప్పినట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.
Arunachal Pradesh Exam
NVS Exam
Navodaya Vidyalaya Samiti
Cheating scandal
Haryana
Itanagar
High-tech copying
Recruitment exam
Exam fraud
Jind Haryana

More Telugu News