AP Weather: ఏపీకి వర్ష సూచన... ఐఎండీ అలర్ట్

AP Weather IMD Issues Rain Alert for Andhra Pradesh
  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • నేడు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
  • పలు జిల్లాల్లో పిడుగులతో పాటు ఈదురుగాలులు
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ
రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అల్పపీడన ప్రభావంతో వాతావరణం చల్లగా మారింది. వివిధ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఉత్తర కర్ణాటక - గోవా తీరాల నుంచి కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున హోల్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల దగ్గర నిలబడరాదని సూచించారు. పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ రోజు (గురువారం) రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

రేపు (శుక్రవారం) అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. 
AP Weather
Andhra Pradesh Rains
IMD Alert
Ronanki Kurmanath
AP Disaster Management
Heavy Rainfall Warning
Coastal Andhra Pradesh
Vizianagaram
Thunderstorms

More Telugu News