India: బలూచిస్థాన్‌లో దాడి... పాకిస్థాన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన భారత్

India Responds Strongly to Pakistans Allegations on Balochistan Attack
  • భారత్ ప్రమేయం ఉందంటూ పాక్ చేసిన ఆరోపణలను ఖండించిన భారత్
  • సొంత వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకేనని స్పష్టీకరణ
  • అంతర్గత సమస్యలకూ భారత్‌ను నిందించడం పాక్‌కు పరిపాటిగా మారిందని ఆగ్రహం
  • విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ప్రకటన
బలూచిస్థాన్‌లో ఇటీవల పాఠశాల బస్సుపై జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో తమ ప్రమేయం ఉందంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా నిరాధారమైనదని, తమ వైఫల్యాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకే పాక్ ఇలాంటి నిందలు వేస్తోందని స్పష్టం చేసింది. తమ దేశంలోని అన్ని సమస్యలకు భారత్‌ను బాధ్యుల్ని చేయడం పాకిస్థాన్‌కు ఒక పరిపాటిగా మారిందని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఖుజ్దార్‌లో జరిగిన దాడిలో భారత్‌ ప్రమేయం ఉందంటూ పాకిస్థాన్‌ చేసిన నిరాధార ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దురదృష్టకర ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి భారత్‌ తన ప్రగాఢ సంతాపం తెలియజేసింది. అయినప్పటికీ, తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంతో పాటు, ఉగ్రవాదానికి అంతర్జాతీయ కేంద్రంగా పేరుగాంచిన పాకిస్థాన్, ప్రపంచ దేశాల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతోంది" అని ఆయన పేర్కొన్నారు.

"వారి దేశంలోని అన్ని సమస్యలకూ భారత్‌పై నిందలు వేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాకిస్థాన్ చేస్తున్న ఇటువంటి కుయుక్తులు ఎప్పటికీ ఫలించవు" అని ఆయన అన్నారు.

కాగా, బలోచిస్థాన్‌లోని ఖుజ్దార్‌ ప్రాంతంలో ఒక పాఠశాల బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి వెనుక స్థానిక వేర్పాటువాద సంస్థల హస్తం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
India
Balochistan attack
Pakistan
Randhir Jaiswal
terrorism
Kujdhar
school bus attack
Balochistan

More Telugu News